కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ 4.0 ముగింపు దశకు వచ్చేసింది. మే 31వ తేదీ వరకు ఆ గడువు ముగియనుంది. అందుకు మరో 2 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో మే 31వ తేదీ అనంతరం లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా ? లేదా ? అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. కాగా గతంలో కన్నా ఇప్పుడే కరోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను మరో 2 వారాల పాటు పొడిగించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
మే 31 అనంతరం లాక్‌డౌన్‌ను పొడిగించాలా, వద్దా అనే విషయంపై ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపాయని తెలుస్తోంది. మరోవైపు పారిశ్రామిక వేత్తలు మాత్రం లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమవుతుందని, మళ్లీ కోలుకునేందుకు చాలా సంవత్సరాలు పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఎత్తేసి.. లాక్డౌన్ పెట్టుకునే నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
ఇక కేవలం కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రమే లాక్‌డౌన్‌ను ఉంచి, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్‌ను ఎత్తేస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే లాక్‌డౌన్‌ను ఒక వేళ ఎత్తేసినా.. రాత్రి పూట కర్ఫ్యూను మాత్రం కొనసాగిస్తారని తెలిసింది. ఇక ఈ విషయంపై మరో 2 రోజుల్లో స్పష్టత వస్తుంది.