ఏబీఎన్ అధినేత ఆర్కే.. తాజాగా బీజేపీకి నీతులు చెప్పారు. ఏపీలో బీజేపీ బాగు కోరుతున్న వ్యక్తిగా ఒక్కసారిగా అవతారం మార్చేశారు. ఇటీవల బీజేపీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి.. తీవ్రస్థాయిలో ఆర్కే కన్నీరు పెట్టుకున్నారు. “జీవీఎల్ వంటి వారి వల్ల ఎదుగుతున్న బీజేపీ మొగ్గలోనే వాడిపోయేలా ఉందన్న భావన కలుగుతోంది“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు. జీవీఎల్‌ను బీజేపీ పెద్దలు తక్షణమే హద్దుల్లో పెట్టాలంటూ.. కూడా హితవులు పలికారు. మరి ఇంతకీ ఇంత అనూహ్యంగా ఎల్లో మీడియా అధినేతకు అంత ప్రేమ ఎలా వచ్చేసిందో అర్ధం కాలేదు.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఏపీలోని జగన్ సర్కారును టార్గెట్ చేయడంలో భాగంగా ప్రతిపక్షాలకు, కొన్ని మీడియా సంస్థలకు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ అంశం బాగాకలిసి వచ్చింది. దీనిని పట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాలని, కుదిరితే.. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించాలని కూడా అనుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇలా వెలుగు చూడగానే అలా లేఖరాశారు. ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే దీనిపై దృష్టి పెట్టాలని ఆయన అభ్యర్థించారు. అయితే, ఈ లేఖ రాసిన మరుక్షణంలోనే బీజేపీ నాయకుడు జీవీఎల్ స్పందించారు.
చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అసలు వాస్తవాలేంటో కూడా తెలుసుకోకుండా చంద్రబాబు ఇలా లెటర్ రాయడమేంటని ప్రశ్నించారు. కేంద్రానికి మరింకేమీ పనులు లేవా? లేఖలు చదువుకులంటూ కూర్చోడమేనా? అనే ప్రశ్నలు సంధించారు. అయినా.. ఫోన్ ట్యాపింగ్ విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని కూడా తేల్చి చెప్పారు. దీంతో జీవీఎల్ వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపాయి. దీనిపై టీడీపీ శ్రేణులు మౌనంగా ఉంటే. ఆర్కే మాత్రం విరుచుకుపడ్డారు. జీవీఎల్ వ్యాఖ్యలు జగన్‌ను ఆయన ప్రభుత్వాన్ని సమర్ధించేలా ఉన్నాయని, పైగా బీజేపీ ఎదుగుదలకు ఈ వ్యాఖ్యలు తీరని ఆటంకాలుగా మారడం ఖాయమని చెప్పుకొచ్చారు. కాబట్టి.. బీజేపీ ఎదగాలంటే.. జీవీఎల్ను కట్టడి చేయాల్సిందేనని తీర్మానం చేశారు.
కానీ, ఇదే.. ఆర్కే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలో ఏపీలో బీజేపీ ఎదిగేందుకు అవకాశమే లేదని, ఏదో దయతలిచి చంద్రబాబు నాలుగు సీట్లు ఇచ్చి గెలిపిస్తే.. మిసిడిపడతారా? అంటూ ప్రశ్నించారు. మరి ఇప్పుడు మాత్రం బీజేపీ ఎదుగుల జోరుగా ఉందని, జీవీఎల్ వంటివారివల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పడం గమనార్హం. ఏదేమైనా.. రాసే కలానికి,.. మాట్లాడే నోరుకు సంబంధం లేనట్టుగా ఉంది పరిస్థితి.