అవును! మాజీ మంత్రి, అనంతపురం నాయకురాలు.. పరిటాల సునీత. గత చంద్రబాబు ప్రభుత్వంలో కీలక మంత్రిగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖను చూసిన ఆమె చూశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం, పార్టీలో సుదీర్ఘ చరిత్ర ను సొంతం చేసుకోవడంతో చంద్రబాబు ఆమె శాఖలో ఎక్కడా వేలు పెట్టలేదు. పైపైన కొన్ని సూచనలు మాత్రమే చేశారు. ఈ క్రమంలోనే ఉన్న మహిళా మంత్రుల్లో అత్యంత స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసుకోగలిగిన మంత్రిగా పరిటాల పేరు తెచ్చుకున్నారు.
అయితే, చంద్రబాబు స్వేచ్ఛ ఇచ్చినా.. ఆమె దానిని వినియోగించుకోలేక పోయారనే వాదన ఉంది. అటు తన సొంత జిల్లా అనంపురంలోనూ, రాష్ట్రంలోనూ కూడా తనదైన ముద్ర వేయడంలో సునీత విఫలమయ్యా రు. ఆమెతో పాటు కొన్నాళ్లు మంత్రిగా చేసిన పీతల సుజాత.. చాలా వరకు దూకుడుగా ఉన్నారు. అటు జిల్లాలోనూ , ఇటు రాష్ట్రంలోనూ సుజాత గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, అంతే రేంజ్‌లో వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారారు. కానీ, సునీత వివాదాలకు కేంద్రం కాకపోయినా.. దూకుడు లేని నాయకురాలిగా మిగిలిపోయారు.
ఇక, ఇప్పుడు… ఏం చేస్తున్నారు.. అంటే.. గోళ్లు గిల్లుకుంటున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆమె తన కుమారుడికి గత ఏడాది ఎన్నికల్లో రాప్తాడు టికెట్ ఇప్పించుకున్నారు. మొత్తంగా మూడు రకాల ఇమేజ్‌లు (పరిటాల ఫ్యామిలీకి ఉన్న పేరు, మంత్రిగా సునీత ఇమేజ్, యువ నేతగా పరిటాల శ్రీరామ్ ఇమేజ్) పనిచేసి.. రాష్ట్రంలో అతిభారీ మెజారిటీతో గెలుపుగుర్రం ఎక్కుతాడని అనుకున్నారు. అయితే, ఆయన చిత్తుగా ఓడిపోయారు.
ఇక, అప్పటి నుంచి సునీత మౌనంగా ఉంటున్నారు. అంతకుముందు ఎంతో కొంత మీడియాతో మాట్లాడేవారు. కానీ, ఇప్పుడు ఎటూ వెళ్లడం లేదు.. ఏమీ మాట్లాడడం లేదు. ఇక చంద్రబాబు రాఫ్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు చూసుకోమని చెప్పినా కూడా వీరు బయటకు రాని పరిస్థితి. దీంతో అసలు పరిటాల ఫ్యామిలీ రాజకీయాల్లో ఉందా? అనే సందేహం వస్తోందని అంటున్నారు పరిశీలకులు.