(పరమ పవిత్రం సోమవారం ఏకాదశి)
శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం. దీనిలో అత్యంత అరుదుగా వచ్చే కలయిక సోమవారం-ఏకాదశి. రేపు ఆ అరుదైన సంఘటన జరుగనున్నది. ఈ పవిత్రమైన రోజు భక్తితో శివకేశవ పూజలు ఆచరించినవారికి అత్యంత విశేష ఫలితాలు లభిస్తాయి. కార్తీకమాసంలో శుక్లపక్ష ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు నక్తం/ఉపవాస వ్రతాలు ఆచరిస్తే వెయ్యి అశ్వమేధాలు- 100 రాజసూయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు భారతంలో ఉంది. ఈ రోజు ఒక్కపూట భోజనం చేయాలి. గత జన్మ పాపాలు పోయి పుణ్యాలు పెరుగుతాయి. సంపద వృద్ధి చెందుతుంది.
సోమవారం తెల్లవారు ఝామున అంటే బ్రాహ్మీ ముహుర్తంలో (ఉదయం 5.30లోపు) స్నానం పూర్తిచేయాలి. తర్వాత దీపారాధన, నిత్యపూజలు, శివాభిషేకం చేసుకోవాలి. తులసిమాలను విష్ణువుకు సమర్పించాలి. కొత్త తులసి చెట్టును నాటితే విశేష ఫలితాలు లభిస్తాయి. నక్తం లేదా ఏకభక్తం చేస్తే మంచిది. బాలలు, వృద్ధులు, ఆనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉపవాసాలు ఉండకూడదని శాస్త్రం చెపుతుంది. వారు దేవుడికి సమీపంగా అంటే స్వామిని భక్తితో శివాపంచక్షారి, విష్ణు అష్టాక్షరిని జపించడం చేస్తే చాలు. దేవాలయ సందర్శన, పూజలు చేయడం తప్పనిసరి. ఈ రోజు అన్ని చేయగలిగే శక్తి ఉండి ఉపవాసాన్ని, స్నాన, పూజాదులను విస్మరిస్తే కుంభీపాకరౌరవాది నరకాల్ని అనుభవిస్తారు అని కార్తీక పురాణంలో వశిష్ట మహర్షి జనకమహారాజుకు తెలిపారు. అత్యంత అరుదుగా వచ్చే సోమవారం-ఏకాదశిని అందరూ సద్వినియోగం చేసుకోండి. నిరంతరం దేవనామస్మరణతో ఈ రోజు గడపండి. దానధర్మాలు చేయండి. ఆరోగ్యం, ఐశ్వర్యం తప్పక లభిస్తుంది.
– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ