అమరావతి! ఆంధ్రుల రాజధాని. సింగపూర్ వంటి అధునాతన నగరాలను తలదన్నేలా నిర్మించడం ఇక్కడే సాధ్యం.. ఇదీ.. ఏపీ రాజధాని అమరావతి పై పెద్ద ఎత్తున వచ్చిన కథనాలు. అయితే. ఇప్పుడు అమరావతిని స్మరించేవారు కరువయ్యారు. ఎక్కడా దీనిపై పెద్దగా ఆశావహ కోణంలో చర్చ సాగడం లేదు. దీనికి కారణం.. జగన్ సర్కారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం. అదే సమయంలో అమరావతిని ఎందుకు కొనసాగించరన్నదానికి చెబుతున్న రీజన్.. దానిని కట్టాలంటే.. లక్షల కోట్లు కావాలి కాబట్టి మనదగ్గర అంతలేదని అంటున్నారు.
నిజమే.. అధునాతన భవంతిని కట్టలేమన్నప్పుడు .. అంతో ఇంతో అయినా.. కొద్దిగా అయినా పూర్తి చేస్తూ.. వెళ్లాలి కదా! కానీ.. వ్యూహం అసలు వేరే ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎలా ఉంటాయి. అమరావతి గురించి.. తొలినాళ్లలో జాతీయ మీడియా రాసిన కథనం ప్రకారం.. ఓ యాభై సంవత్సరాల తర్వాత.. దేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే ఇలాంటి నగరం ఒకటి ఉందని చెప్పుకొనే స్థాయికి చేరుకుంటుంది! అని రాశారు. ఆ పత్రికేమీ.. చంద్రబాబుకు మానసపుత్రిక కాదు! వాస్తవమే రాసింది. అంటే.. వ్యూహం మంచిదే.. కానీ, దీని వెనుక కొన్ని రాజకీయ క్రీనీడలు చేరడమే పెద్ద తప్పయింది.
అయితే.. సీఎం జగన్ను కూడా తక్కువగా అంచనావేయలేం. ఆయనకు మాత్రం అమరావతిపై ప్రేమ లేకకాదు.. అధునాతన రాజధానిని ఇష్టపడకపోవడమూ కాదు. ఎటొచ్చీ.. ఆయనకు మనసు లేకపోవడమే.. ఈ కారణంగానే అమరావతి ఆశలు.. అడియాసలుగా మారుతున్నాయి. అదే సమయంలో మూడు రాజధానులు అనే జగన్ కలలు ఊపిరిపోసుకున్నాయి. నేటితో అమరావతి అనే అతిపెద్ద రాజధాని నగరానికి శంకు స్థాపన జరిగి ఖచ్చితంగా ఐదేళ్లు పూర్తయ్యాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇక్కడ పనులు ఆగిపోవడమే తప్ప.. జరిగింది లేదు. మొత్తానికి ఏపీకి ఒక రాజధాని అంటూ.. చెప్పాల్సి వస్తే.. మున్ముందు తరాలు ఏదీ ? అని అడిగే పరిస్థితి మిగిలిపోయిందనే ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుండడం గమనార్హం.
-Vuyyuru Subhash