టిఆర్ఎస్ ఓటమికి ఇవన్నీ కారణాలే

-

టిఆర్ఎస్ పార్టీ అంటే విజయానికి మారుపేరు గా నిలుస్తూ వచ్చేది. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా , ఈ విజయం ఆ పార్టీ కే దక్కేది. ఇది చాలా కాలంగా తెలంగాణలో జరుగుతూ వస్తోంది. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎన్నికల సమయం నాటికి ఓటర్లు తమ వైపు ఉండేలా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రాజకీయ చక్రం తిప్పడంలో బాగా ఆరితేరిపోయారు. అయితే ఎవరూ ఊహించని విధంగా టిఆర్ఎస్ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి చెందింది. సిట్టింగ్ స్థానం అయిన ఇక్కడ పట్టు కోల్పోతామని టిఆర్ఎస్ నాయకులు ఎవరూ ఊహించలేకపోయారు. ఒకవేళ ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఉన్నా, స్వల్ప మెజారిటీతో గట్టెక్కేస్తామని ఆ పార్టీ నేతల్లో ధీమా కనిపించింది. అసలు తమకు బిజెపి పోటీనే కాదు అని మొదట్లో ధీమాగా చెప్పారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు.

కానీ చివరికి ఆ పార్టీ చేతిలోనే ఓటమి చవి చూడడం ఎప్పటికీ మింగుడు పడడం లేదు. అసలు టిఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి చెందడానికి గల కారణాలు ఏమిటో ఒకసారి విశ్లేషిస్తే అనేక విషయాలు బయటపడుతున్నాయి. గత కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడం, టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత కుటుంబంపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత, అలాగే బలమైన వర్గం ఉన్న చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ పార్టీ తరపున అభ్యర్థిగా నిలబడటం వంటి కారణాలతో టిఆర్ఎస్ ఓట్లలో చీలిక వచ్చింది. అలాగే మల్లన్న సాగర్ ముంపు ప్రాంత ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడం, దీనికితోడు బీజేపీ నుంచి బరిలోకి దిగిన రఘునందన్ రావు గతంలో రెండుసార్లు ఓటమి చెందడం, ఆయనపై జనాల్లో సానుభూతి ఉండడం, ఆయన ఓటమి చెందినా, నియోజకవర్గ సమస్యలపై నిత్యం పోరాడుతూ ఉండడం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం, ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ ప్రజల తరఫున నిలబడుతూ, ఓడినా, గెలిచినా, తాను మీ వెంటే అనే సంకేతాలను జనాల్లోకి బాగా తీసుకు వెళ్లడం, కాంగ్రెస్ బలహీనంగా ఉండడం, అధికార పార్టీపై వ్యతిరేకత , ఇవన్నీ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కు బాగా కలిసి వచ్చాయి.

ఇక యువతలోను టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత, నిరుద్యోగుల్లో అసంతృప్తి, సోషల్ మీడియాలో టిఆర్ఎస్ ప్రతికూలత ఎదుర్కోవడం, బిజెపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు బాగా యాక్టివ్ గా పని చేయడం, ముందు నుంచి రఘునందన్ రావు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి ఎన్నో ఎన్నెన్నో కారణాలు టిఆర్ఎస్ ఓటమికి దారితీశాయి. రఘునందన్ రావు గెలుపుతో టిఆర్ఎస్ ఓటమికి బీజాలు పడినట్లేనని , ఇక తెలంగాణలో బీజేపీ హవా మొదలైనట్టుగానే రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news