కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో తన బృందంతో అధ్యక్షుడు ట్రంప్ సహకరించాలని నూతనంగా ఎన్నికైన జో బైడెన్ కోరారు. విధాన పరమైన సమస్యలన్నింటినీ తమతో చర్చించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ వైరస్ వల్ల చనిపోయే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని హెచ్చరించారు. అయితే అధికార మార్పిడికి ట్రంప్ నిరాకరిస్తుండటంతో బైడెన్ ఈ విధంగా స్పందించారు.
వ్యాక్సిన్ అందరికీ అందిచటం చాలా ముఖ్యమైన పని అని బైడెన్ అన్నారు. ఇందుకోసం తక్షణమే ప్రణాళికలు రూపొందించాలి పేర్కొన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేయటానికి ఇంకా చాలా సమయం ఉందని అప్పటి వరకూ (జనవరి 20) వేచి ఉంటే ఈ మహమ్మారికి అరికట్టడం కష్టమవుతుందన్నారు. వీలైనంత త్వరగా తమతో సహకరించాలని బైడెన్ ట్రంప్ ను కోరారు. ఇందుకు నిరాకరిస్తే తామే సొంతంగా ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుందని బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రోన్ క్లెయిన్ తెలిపారు.
అవసరమైతే తానూ వ్యాక్సిన్ తీసుకుంటా అని బైడెన్ పేర్కొన్నారు. అందువల్ల టీకా భద్రతపై ఏర్పడిన భయాలు, అనుమానాలు తొలగిపోతాయని స్పష్టం చేశారు. కొవిడ్ ఈ స్థాయిలో పెరుగుతుండటంతో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఈ సందర్భంగా బైడెన్ పరోక్షంగా మోడెర్నా, ఫైజర్ టీకాల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ వైరస్ విడుదలై మంగళవారంతో ఏడాది పూర్తవుతుంది. చైనాలో మొదలై ప్రపంచ దేశాలన్నింటిలో ఈ వైరస్ స్వైర విహారం చేస్తోంది. సామాన్య ప్రజల నుంచి దేశాధినేతల వరకు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి వల్ల ఇప్పటి వరకు మొత్తం దాదాపు 13.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. హాంకాంగ్ కేంద్రంగా వెలువడే ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పేర్కొంది. చైనాలోని హుబెయ్ రాష్ట్రంలో 2019 నవంబరు 17న 55 ఏళ్ల వ్యక్తిలో కరోనా తొలి కేసు వెలుగు చూసిందని ఆ పత్రిక వెల్లడించింది. అయితే చైనాలో 2019 డిసెంబరు 8న కరోనా తొలికేసు వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండగా.. డిసెంబరు 1న తొలి కేసు నమోదైనట్లు ‘ది లాన్సెట్’ కథనం స్పష్టం చేసింది.