దేశంలోని చిరువ్యాపారులకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నవారికి పేటీఎం శుభవార్త చెప్పింది. తమ యాప్ ద్వారా వారికి రూ.1 లక్ష వరకు ఇన్‌స్టంట్ రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు గాను సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో పేటీఎం భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలోనే చిరు వ్యాపారులకు రుణాలను అందిస్తున్నట్లు ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
చిరు వ్యాపారులు పేటీఎం బిజినెస్ యాప్‌లోకి వెళ్లి అందులో రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రక్రియ అంతా డిజిటల్ రూపంలో ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారులు రూ.1 లక్ష వరకు రుణాన్ని ఇన్‌స్టంట్‌గా పొందవచ్చు. అవసరం అనుకుంటే రూ.1 లక్షకు పైగా రుణాన్ని కూడా తీసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రుణం కోసం అప్లై చేశాక నిమిషాల వ్యవధిలోనే వెరిఫికేషన్ అంతా పూర్తయి రియల్ టైంలో చిరు వ్యాపారుల అకౌంట్లలో రుణం మొత్తం జమ అవుతుంది.
ఇక పేటీఎం బిజినెస్ యాప్ ద్వారా తీసుకునే రుణాలను 12 నుంచి 18 నెలల వ్యవధిలోగా చెల్లించాలి. ప్రస్తుతం అనేక మంది వ్యాపారులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాము తీసుకువచ్చిన ఈ సదుపాయం ఎంతో మందికి మేలు చేస్తుందని పేటీఎం భావిస్తోంది.