సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ అక్టోబర్ నెలలో ఐఫోన్ 12 సిరీస్‌లో ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ పేరిట నాలుగు కొత్త ఐఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా ఆ ఫోన్లకు యూజర్ల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తోంది. ఆ ఫోన్ల ధరలు మరీ ఎక్కువగా ఉన్నా వాటిని ఐఫోన్ ప్రియులు ఎక్కువ సంఖ్యలోనే కొనుగోలు చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఐఫోన్ 12 ఫోన్లలో కొత్త సమస్య వచ్చిందని యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు.
ఐఫోన్ 12 ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోతుందని, ఫోన్ ను ఉపయోగించకపోయినా, అందులో బ్యాక్‌గ్రౌండ్ యాప్ యాక్టివిటీ, 5జి ఫీచర్లను ఆఫ్ చేసినా, ఫోన్ స్టాండ్‌బైలో ఉన్నా బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుందని యూజర్లు గుర్తించారు. సాధారణం కన్నా 4 శాతం ఎక్కువగా బ్యాటరీ ఖర్చవుతుందని చాలా మంది యూజర్లు అటు యాపిల్ కమ్యూనిటీ ఫోరంలలో, ఇటు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై యాపిల్ ఇంకా స్పందించలేదు. కానీ త్వరలోనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా యాపిల్ ఈ సమస్యకు పరిష్కారం అందిస్తుందని భావిస్తున్నారు. ఇక యాపిల్ సంస్థ ఇటీవలే భారీ ఎత్తున ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. పాత ఐఫోన్ల బ్యాటరీ సామర్థ్యాన్ని కావాలనే యాపిల్ తగ్గిస్తుందని, దీంతో బ్యాటరీలను మార్చి కొత్త బ్యాటరీలను అనవసరంగా వేయించుకోవాల్సి వస్తుందని పలువురు యూజర్లు ఫిర్యాదు చేయడంతో యాపిల్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇక తాజాగా ఐఫోన్ 12 ఫోన్లలో ఈ సమస్య వస్తుండడం చర్చనీయాంశంగా మారింది.