రజనీకాంత్ ఓ స్టార్ హీరో. ఒక్క తమిళనాడులోనే కాకుండా.. దేశమంతా ఆయనకో ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలకు బ్రాండ్ రజనీనే. ఆయన స్టయిలే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సొంతంగా పార్టీ పెట్టి వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లెక్కలు వేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి.. తమిళనాడులో చక్రం తిప్పాలని అనుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ సడన్ గా ఎందుకు వెనక్కి తగ్గారు..తన బలం.. బలహీనతలు రజనీకాంత్‌కు తెలిశాయా లేక ఆస్పత్రిలో జ్ఞానోదయమైందా?
ఎంజీఆర్, జయలలితల తర్వాత తమిళనాడులో వెండితెరను ఓ ఊపు ఊపిన రజనీకాంత్.. రాజకీయ తెరపైనా హిట్ కొడదామని ఆశించారు. దాదాపు నాలుగేళ్లుగా కసరత్తు చేస్తున్న ఆయన.. ఈ నెల 31న అధికారికంగా పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు కూడా. దీంతో ఒక్కసారిగా తమిళ రాజకీయం హీటెక్కింది. రజనీ పార్టీ పేరు, పార్టీ గుర్తు.. ఆయన చెప్పే విధానాలపై హైప్ పెరిగిపోయింది. 31న ఆయన ఏం చెబుతారా అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో షాక్ ఇచ్చారు రజనీకాంత్.
హైదరాబాద్‌లో కొత్త సినిమా షూటింగ్‌లో ఉన్న రజనీ..హైబీపీతో అపోలో ఆస్పత్రిలో చేరారు. మూడురోజుల చికిత్స తర్వాత చెన్నై వెళ్లిపోయిన ఆయనపై కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చారో.. లేక రాజకీయాలు తన ఒంటికి సరిపడవని భావించారో ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు. రాజకీయాల్లోకి రావడం లేదని.. పార్టీ పెట్టడం లేదని తేల్చేశారు రజనీ కాంత్. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించలేనని 3 పేజీల లేఖ విడుదల చేశారు. రాజకీయ పార్టీకి తన ఆరోగ్యం సహకరించడం లేదన్నది ఆయన చెప్పే మాట. ఇదంతా పైకి తెలిసిన విషయం. కానీ.. రాజకీయ, సినీ వర్గాల్లో మరో చర్చ జరుగుతోందట.
రజనీకాంత్‌కు ఆస్పత్రిలో జ్ఞానోదయమైందన్న చర్చ మొదలైంది. పార్టీ ప్రకటనకు ముందు స్టార్ హీరో ఆస్పత్రిలో చేరితే తమిళనాడులో అస్సలు చర్చే లేదు. అభిమానుల ఏడుపులు.. పెడబొబ్బలు.. పూజలు పునస్కారాలు అస్సలు లేవు. సాధారణంగా తమిళనాడులో తమ ఆరాధ్య నటుడు లేదా రాజకీయ నేతకు ఏదైనా జరిగితే అభిమానులు అస్సలు తట్టుకోలేరు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రం అట్టుడికిపోయింది. అలాంటిది రజనీకాంత్ ఆస్పత్రిలో చేరితే ఎలాంటి స్పందన లేదు. రాజకీయ, తమిళ సినీ వర్గాల నుంచి పెద్దగా రియాక్షన్ కనిపించలేదు. దీంతో తన బలం, బలహీనతలు రజనీకాంత్‌కు అర్థమయ్యాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రజనీ వయస్సు 70ఏళ్లు. ఇప్పటి వరకూ తనకంటూ ఒక ఇమేజ్‌ను ప్రజల్లో ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లి.. సక్సెస్ కాలేకపోతే.. అప్పటి వరకు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా దూరమవుతాయన్న భయం రజనీకాంత్‌లో ఉందన్నది కొందరి వాదన. రాజకీయ నాయకుడిగా మారిన హీరో విజయకాంత్ పరిస్థితి ఎలా ఉందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇలాంటి అంశాలన్నింటిపైనా కొన్నేళ్లుగా తీవ్రంగానే ఆయన అంతర్మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది. చివరకు అపోలో ఆస్పత్రిలో ఉన్న మూడు రోజులు రజనీకాంత్‌కు టెస్టింగ్‌గా మారినట్టు అనిపిస్తోంది.