సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. కొందరు కావాలని పనిగట్టుకుని మరీ ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. దీంతో జనాలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫేక్ న్యూస్‌కు ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఇక తాజాగా మరొక ఫేక్ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందజేస్తుందని ఓ మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఇచ్చే లింక్‌లో వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలని, దీంతో లెనోవోకు చెందిన ల్యాప్‌టాప్ విద్యార్థులకు ఉచితంగా లభిస్తుందని.. ఆ మెసేజ్‌లో ఉంది. అలాగే ఇంకో మెసేజ్‌లోనూ ఇదే తరహాలో ప్రచారం చేస్తున్నారు. వారు ఇచ్చిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలను నింపి సబ్మిట్ చేస్తే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ లభిస్తుందని మెసేజ్‌లో ఇచ్చారు.
అయితే ఈ విషయాన్ని చాలా మంది నిజమే అని నమ్మారు. దీంతో అనేక మందికి చెందిన వ్యక్తిగత వివరాలను ఇప్పటికే దుండగుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అయితే వెరిఫై చేయగా సదరు రెండు మెసేజ్‌లు ఫేక్ అని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లను, ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.