సోషల్ మీడియలో వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్‌కు అసలు ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కొందరు వ్యక్తులు కావాలని పనిగట్టుకుని మరీ ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ కిరన్ పొల్లార్డ్ చనిపోయాడని యూట్యూబ్‌లో ఓ ఫేక్ వీడియో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అయితే అందులో నిజం లేదని వెల్లడైంది.
వెస్టిండీస్ క్రికెటర్ కిరన్ పొల్లార్డ్ ప్రస్తుతం అబుధాబిలో టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. అయితే అతను కార్ యాక్సిడెంట్లో చనిపోయాడనే వార్త ఒక్క సారిగా దావానలంలా వ్యాప్తి చెందింది. యూట్యూబ్‌లో అతని కార్ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫొటోలు అంటూ కొందరు కొన్ని ఫొటోలను పెట్టి వీడియోలను అప్లోడ్ చేశారు. అయితే అదంతా అబద్దమని, పొల్లార్డ్‌కు ఏమీ కాలేదని, అతను భేషుగ్గానే ఉన్నాడని నిర్దారించారు.
కాగా పొల్లార్డ్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. త్వరలో మళ్లీ ఇంకో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు అతను సిద్ధమవుతున్నాడు. ఇక వచ్చే సీజన్‌కు గాను ఐపీఎల్ మేనేజ్ మెంట్ ఫిబ్రవరి 18వ తేదీన చెన్నైలో మినీ వేలం నిర్వహించనుంది. అందులో 100 మందికి పైగా ప్లేయర్లకు వేలం నిర్వహించనున్నారు.