తెలంగాణలో పీఆర్సీ సంగతి చూస్తే..రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. సంక్రాంతికి పీఆర్సీ అని ప్రభుత్వం మాట ఇచ్చింది. క్యాలెండర్లో పేజీలు మారుతున్నాయి కానీ ఉద్యోగుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ పేరిట మరో అడ్డంకి…వేతన సవరణ ఎంతో తెలీదు..ప్రమోషన్లు అతీగతీ లేవు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పీఆర్సీ పై ఉద్యోగుల అసంతృప్తి నేతలను తెగ టెన్షన్ పెడుతుందట..
పీఆర్సీ పై ఉద్యోగులు వేస్తున్న ప్రశ్నలకు ఉద్యోగ సంఘాల నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. సంక్రాంతి పోయి ఉగాది వచ్చేలా ఉంది. క్యాలెండర్లో పేజీలు మారుతున్నాయి కానీ ఉద్యోగుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఉద్యోగులతో సంప్రదింపుల కమిటీ సమావేశం అవుతున్నా ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియదు. కాలగర్భంలో రోజులు.. నెలలు కలిసిపోతున్నాయి. వేతన సవరణ ఎంతో ఊహకందదు. ప్రమోషన్లు అతీగతీ లేవు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోడ్ అమలులోకి వచ్చేసింది.
ఎన్నికల సమయం కావడంతో పీఆర్సీ పై నిర్ణయం తీసుకునే వెసులుబాటు తక్కువే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో వాటిపై ఉద్యోగుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అందుకే పీఆర్సీపై నిర్ణయం తీసుకోబోరని కొందరు చెబుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే.. వేతన సవరణ అంశం మళ్లీ వాయిదా పడే ప్రమాదం ఉంది. ఈ విషయాలనే దగ్గర పెట్టుకుని వేతన సవరణపై ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందా అని ఉద్యోగులు పేపర్లపై లెక్కలు వేసుకుంటున్నారు.
తమకు ఎదురైన ఈ చేదు అనుభవాలను తలచుకుని.. ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్టులు పెడుతున్నారట..ఇక ఉద్యోగుల ఒత్తిడితో ఉద్యోగ సంఘాల నేతలకు సైతం తలబొప్పి కడుతోందట. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని టీఎన్జీవో.. టీజీవో నాయకులపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వేతన సవరణ వాయిదాలపై వాయిదా పడుతుంటే మరింత ఇరకాటంలో పడుతున్నారు.
టీఎన్జీవోని వ్యతిరేకిస్తున్న ఐక్య వేదిక నాయకులు. ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి. ఇప్పుడి పీఆర్సీ వివాదం ఎన్నికల వేళ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.