ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు అధికారులకు చుక్కలు చూపిస్తుంది. ఉన్నతాధికారిగా వచ్చే వారంతా మూడు నెలలు తిరగకుండానే మరో ఆఫీసు దారి చూసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ పేరు చెబితేనే అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. జిల్లా మొత్తం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే ప్రాతినిధ్యం వహిస్తున్నా…తాండూరు మున్సిపాలిటీ కమిషనర్ కుర్చీ అంటే హడలిపోతున్నారు.
తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా రావడానికి అధికారులు ఎవరు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరంలో దాదాపు ఆరుగురు కమిషనర్లు మారారంటే ఇక్కడ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతి తక్కువ కాలానికే ఆరుగురు కమిషనర్ మార్పు వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. వర్గపోరు రాజకీయాల వల్ల తాండూరు మున్సిపాలిటీ కమిషనర్‌గా రావడానికి ఉన్నతాధికారులు వెనకడుగు వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఏడాది కాలంలో తాండూరు మున్సిపాలిటీకి ఆరుగురు కమిషనర్లు మారడం పట్టణంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్‌గా ఇక్కడకు వచ్చిన వారికి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా ఉందట పరిస్థితి. గత ఏడాది కాలంలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్లు ఒకరు ఉన్నత చదువుల పేరుతో.. మరొకరు ఆరోగ్య కారణాలతో లాంగ్‌లీవ్ పెట్టి మరీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే వచ్చిన వారంతా మూడునెలలు తిరక్కుండానే వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో అభివృద్ధి విషయమై అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. కమిషనర్ ఒక వర్గానికి మాత్రమే మద్దతు తెలుపుతున్నారన్న ఆరోపణలతో ప్రవీణ్ కుమార్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు. అధికార టీఆర్ఎస్ పార్టీలోనే ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. దీనివల్ల తాండూరు మున్సిపల్ పాలన గాడి తప్పుతోంది స్థానికంగా పలువురు చర్చించుకుంటున్నారు.
స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు మున్సిపాలిటీలో ఉన్నారు. ఒకరు కాదంటే మరొకరు అవునంటుండటంతో సమస్య తలెత్తుతుంది. దీనికి తోడు ఎమ్మెల్యే ఒక పని, ఎమ్మెల్సీ మరో పని చెబుతూ కమిషనర్ మీద ఒత్తిళ్లు తెస్తున్నారని.. ఈ రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు బదిలీలు చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.