అంతర్జాలం బాగా పాపులర్ అయ్యాక సోషల్ మీడియా పరిధి బాగా విస్తరించింది. దాంతో అంతకుముందు ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా రాత్రికి రాత్రే వైరల్ అవుతున్నాయి. ఐతే దీనివల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నష్టాలని పక్కన పెట్టి లాభాలనే చూసుకుంటే, ఎన్నో జీవితాలు మనకు ప్రేరణగా నిలుస్తాయి. బయట కనిపించని టాలెంట్ సోషల్ మీడియా ద్వారా బయటపడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒకానొక వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.
98ఏళ్ళ వృద్ధుడు శనగలు అమ్ముకుంటూ ఉండడమే ఆ వీడియో సందేశం. ఉత్తరపదేశ్ లోని రాయ్ బరేలిలో తీసిన ఈ వీడియోకి వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. వీధి వ్యాపారం చేసుకునే వాళ్లలో ఒకడైన విజయ్ పాల్ సింగ్, రాయ్ బరేలి వీధుల్లో శనగలతో ఛాట్ చేసి అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. పూర్తి వృద్ధాప్యంలో ఇలా శనగలు అమ్ముకుంటూ తన పొట్టకి తనే అమ్ముకోవడం ఎందుకు అని చాలా మంది అడిగితే దానికి ఆయనిచ్చే సమాధానం ఆశ్చర్యం వేయడంతో పాటు ఎక్కడ లేని ప్రేరణని ఇస్తుంది.
శనగలు అమ్ముకోవడం తనకి బాగా నచ్చుతుందని, ఇంట్లో ఏ పనీ చేయకుండా ఊరికే ఉండడం నాకు ఇష్టం ఉండదనీ, దానివల్ల జీవితం మీద ఆసక్తి తగ్గిపోతుందనీ, ఇలా పనిచేస్తూ ఉంటే ఉత్సాహంగా ఉంటుందనీ, అందుకే నాకు అవసరం లేకపోయినా సరే ఆరోగ్యంగా ఉండడానికి, శరీరాన్ని మరింత ఫిట్ గా ఉంచుకునేందుకు ఈ వీధి వ్యాపారం చేసుకుంటున్నానని తెలిపాడు. ఆరోగ్యం గురించి అలక్ష్యం చేయద్దని తెలిపే అద్భుతమైన కథ ఇది.