ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కొత్త తలనొప్పిగా మారాయి. ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న బాధ్యతలు చేపట్టిన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సహానీ కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే అధికార వైసీపీ మినహా మరే పార్టీ కూడా ఇందుకు ఒప్పుకోవడం లేదు. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన – బీజేపీ ఇలాంటి కీలక పార్టీలు సైతం గైర్హాజరయ్యాయి.
అయితే మరోపక్క జనసేన దాఖలు చేసిన పిటిషన్ ఒకటి హైకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉంది. దాని మీద మూడో తారీఖున విచారణ జరగాల్సి ఉంది అయినా సరే కొత్త ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఎన్నికల కమిషనర్ జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ సవాల్ చేస్తూ వీరు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరగా ఆ మూడు పిటిషన్లను ఈరోజు హైకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.