కేంద్ర ప్రభుత్వం సీబీఐ పై అనుసరించిన వ్యవహారంపై సుప్రీం కోర్టు సాక్షిగా సీబీఐ డైరెక్టర్ ఆలోక్ కుమార్ వర్మ గెలుపొందారు. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఉత్కంట రేకిత్తించిన సీబీఐకి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పునిచ్చింది. రాత్రికి రాత్రే కేంద్రప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ కుమార్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం… ఆలోక్‌వర్మకు తిరిగి బాధ్యతలను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అయితే సీబీఐ కేసులో కేంద్రం వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.
ఈ వ్యవహారంలో సీవీసీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సైతం కోర్టు పక్కనబెట్టింది. ఈ అంశంపై ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి వారంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కొద్ది నెలల క్రితం రాకేశ్ ఆస్థానా,అలోక్ వర్మాల మధ్య చెలరేగిన వివాదం సుప్రీంకి చేరిన విషయం తెలిసిందే.