దేశవ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. కానీ, ఆ పండుగ ముగిసిన రెండో రోజున యాదవులు మాత్రమే జరుపుకొనే పండుగ సదర్. ఈ పండుగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. ఇందులో దున్నపోతులు ప్రధాన ఆకర్షణగా నిలువడంతో దున్నపోతుల ఉత్సవంగా కూడా పేర్కొంటారు.
యాదవులు జరుపుకునే ప్రధాన పండుగలలో ‘సదర్’ కూడా ఒకటి. సదర్ అంటే ప్రధానమైనది అని అర్థం. ముస్తాబు చేసిన దున్నపోతులతో యువకులు విన్యాసాలు చేయించడం సదర్ ప్రత్యేకత.
సదర్ ఉత్సవాలు హైదరాబాద్‌కే పరిమితం. దేశంలో మరెక్కడా ఈ ఉత్సవాలు జరగవు. నగరంలోని నారాయణగూడలో జరిగే ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణ. కాచిగూడ, ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్పల్లి, ఈస్ట్మారెడుపల్లి, చప్పల్‌బజార్, మధురాపూర్, కార్వాన్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు జరుగుతాయి. 2009 తర్వాత నుంచి పంజాబ్, హర్యానాల నుంచి భారీ శరీరం గల దున్నపోతులు సదర్ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ముస్తాబు చేసిన దున్నపోతులతో విన్యాసాలు చేయిస్తుంటారు. ముక్కతాడును చేత పట్టుకుని వాటిని అదుపు చేస్తుంటారు. కొన్నింటిని గంగిరెద్దులా ఆడిస్తారు. ప్రధాన ఎంపిక చేసిన ఆవరణ, బస్తీ, ఖాళీ ప్రదేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు.