పంచ్ ప్రభాకర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. అతి త్వరలో సీబీఐ ఆయన్ని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తులను అవమానించేలా పోస్టులు పెట్టిన నిందితుడు పంచ్ ప్రభాకర్‌ను 10 రోజులు అరెస్టు చేయాలని ఏపీ హైకోర్టు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ వీలు కాకపోతే సీబీఐకు సంబంధం లేకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది. హైకోర్టు హెచ్చరికతో పంచ్ ప్రభాకర్ కేసును సీబీఐ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో పంచ్ ప్రభాకర్‌ను అతి త్వరలో సీబీఐ అరెస్టు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.
న్యాయమూర్తులు, హైకోర్టు జడ్జీలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు మొత్తం 11 మందిపై సీబీఐ చార్జీషీట్ వేసింది. గూడ శ్రీధర్‌రెడ్డి, దరిస కిషోర్ రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, శ్రీనాథ్ సుస్వరం, అజయ్ అమృత్‌లపై సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది.
పంచ్ ప్రభాకర్. వైఎస్సాఆర్‌సీపీ అభిమాని. జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని. యూట్యూబ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా విరుచుకుపడుతుంటారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్‌లపై తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేస్తుంటాడు. ఒక్కోసారి అవి శ్రుతి మించుతుంటాయి కూడా. నాయకులపై వ్యాఖ్యలు చేయడం వరకు ఒకే కానీ, న్యాయవ్యవస్థపై అనుచితంగా మాట్లాడితే అంతే సంగతులు. ఏ తప్పయితే చేయకూడదో అదే చేశాడు పంచ్ ప్రభాకర్. అందుకు పర్యావసనంగా జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి తలెత్తింది.