రహదారుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పై క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల పై ఉన్న గుంతలు తక్షణమే పూడ్చాలని.. వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై అధికారులు దృష్టి పెట్టాలని.. ముందు పాట్ హోల్ ఫ్రీ స్టేట్‌గా రహదారులు ఉండాలి, తర్వాత కార్పెటింగ్ పనులు పూర్తిచేయాలని పేర్కొన్నారు.
విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు వాహనదారులకు అందుబాటులోకి రావాలని.. ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌లలో టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని స్పష్టం చేశారు. 2022 జూన్ కల్లా రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణ పూర్తికావాలని.. రాష్ట్రం మొత్తం రహదారుల మరమ్మత్తులు ఒక డ్రైవ్‌లా చేయాలని పిలుపునిచ్చారు సిఎం జగన్. అందరూ అధికారులు.. దీనిపై చాలా శ్రద్దగా పని చేయాలని ఆదేశించారు సిఎం జగన్.