రామోజీ రావు ఫైట్ చేశారు. పల్లెలకు సురక్షిత నీరు ఇవ్వమని ప్రార్థించారు.పోరాడారు. అక్షర యుద్ధం కారణంగా ఇవాళ ప్రభుత్వం స్పందించి సంబంధిత నిధుల విడుదల విషయమై యంత్రాంగంతో చర్చించింది. అన్నీ కుదిరితే పదిహేడు వేల కోట్ల రూపాయలతో పల్లె జనాలకు రక్షిత నీరు రోగ రహిత నీరు, పరిశుద్ధతకు ఆనవాలుగా నిలిచే నీరు అందనుంది అన్నది సీఎం చెప్పిన చల్లని కబురు.
ముఖ్యంగా వాటర్ ప్లాంట్ల క్లోరినేషన్ అన్నది ఎప్పటికప్పుడు చేయాలని అధికారులను పల్లె జనం వేడుకుంటూ సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఏదేమయినప్పటికీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు (900 కోట్లు) విద్యుత్ ఛార్జీల చెల్లింపునకు వెచ్చించామని అధికారులు అంటుంటే, అవన్నీ వద్దు మనమే నిధులు విడుదల చేసి రక్షిత నీటి పథకాలకు ఓ రూపం ఇద్దాం అని జగన్ అంటుండడమే ఇప్పటి స్పందనకు సిసలు తార్కాణం.
రక్షిత మంచి నీరు అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలలో తాత్సారం చేస్తుందంటూ ప్రధాన మీడియా ఈనాడు ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎం స్పందించారు. రామోజీ కథనానికి విలువ ఇస్తూ నిధులు కూడా విడుదల చేయడంతో ఇప్పుడిక గ్రామీణ మంచినీటి సరఫరాలో మంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఒక్కో పథకానికి నెలకు నలభై నుంచి అరవై వేలు వెచ్చించాల్సి ఉన్నా నిధులు ఇవ్వడంలో సర్కారు వైఫల్యం అవుతోందని ఆవేదన చెందుతూ మొన్నటి ఆదివారం ఈనాడు రాసిన కథనంతో పాలక వర్గాల్లో చలనం వచ్చింది. ఈ మేరకు మంచినీటి పథకాలకు సంబంధించి గ్రామాల దాహార్తిని తీర్చేందుకు సీఎం జగన్ నిన్నటి వేళ 17889 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు.
ఆ విధంగా పల్లెల్లో నిరుపయోగంగా ఉన్న రక్షిత మంచి నీటి పథకాలను ఉపయోగంలోకి తీసుకురానున్నారు.అదేవిధంగా వాటర్ ట్యాంకులను శుభ్రం చేసేందుకు, పాడయిపోయిన మోటార్లను బాగుచేసేందుకు కూడా సంబంధిత అధికారులు దృష్టి సారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వచ్చే ఏడాది ఆఖరుకు సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీంతో సంబంధిత పనుల్లో త్వరలోనే కదలిక వస్తే ఇక పల్లెలకు సురక్షిత నీరు రోగ రహిత కారకంగా అందనుంది. పల్లెల దాహార్తి తీరడమే కాదు దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఇంటింటికీ కుళాయి పథకంకు కూడా ఓ రూపం రానుంది.