తెలంగాణ బోనాలు రంగం గరం గరం… స్వర్ణలత ఆగ్రహం

-


తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇప్పటివరకు బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. తెలంగాణ సర్కారు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి ప్రాధాన్యత ఇచ్చి జరుపుతున్నది. తొలి నాలుగేళ్లు బాగానే సాగాయి బోనాల పండుగలు. కానీ ఈసారి బోనాలు గరం గరం అయ్యాయి. బోనాల పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి తల్లికి పెట్టే బోనాలు. లక్షల మంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తారు. తొలినాళ్లలో వైభవంగానే ఉజ్జయినీ ఉత్సవాలు జరిగాయి. కానీ ఈ ఏడాది ఎందుకో కానీ బోనాలు పండుగ గతంలా కాకుండా గరం గరంగా సాగాయి.

ఆదివారం బోనాల ఉత్సవాల్లో భాగంగా సిఎం కేసిఆర్ ఉజ్జయినీ మహాంకాళీ తల్లికి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవటానికి వీఐపీలు, వీవీఐపీలు పెద్ద సంఖ్యలో వచ్చారు. విఐపిలు వచ్చిన సందర్భంలో మహిళా భక్తులను గంటల తరబడి క్యూ లైన్లోనే నిలబటెట్టారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఏకంగా జోగిని శ్యామల ఈ విషయంలో సీరియస్ అయ్యారు. కంట తడి పెట్టారు. తెలంగాణ సర్కారుపై శాపనార్థాలు పెట్టారు. ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ శపించారు.

సోమవారం రంగం (భవిష్యవాణి) చెప్పిన మాతంగి స్వర్ణలత గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ సర్కారు మీద గరం అయ్యారు. బంగారు బోనం తనకు సంతోషంతోపాటు బాధను కూడా కలిగించిందని స్వర్ణలత రంగం చెప్పారు. అంతేకాదు ప్రజలందరినీ సంతోషంగా ఉంచాలని ఆకాంక్షించారు. నా భక్తులంతా సంతోషంతో నాదగ్గరకు రావాలి కానీ బాధతో వస్తున్నారు. నా ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి వచ్చింది. ఆడపడుచులు నా బిడ్డలే. వారు సంతోషంగా రావాలి. అని స్వర్ణలత జోస్యం చెప్పారు. మీరు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు.. నా బిడ్డలను ఇబ్బంది పెట్టొద్దు అంటూ స్వర్ణలత రంగం సాగింది.

మాతంగి స్వర్ణలత రంగంలో ఈ అంశాలను వెల్లడించారు.

బంగారు బోనం సమర్పించామని మీరు సంతోష పడుతున్నారు..కానీ నాది నాకే సమర్పించారు.

నాకు ఎవ్వరూ బంగారు బోనం పెట్టలేదు…నాది నేనే తెచ్చుకున్నాను.

బంగారు బోనం సమర్పణ జరిగినా..నేను దుఃఖంతో ఉన్నాను.

నా సన్నిధికి వస్తున్న భక్తులు దుక్కం తో వస్తున్నారు… దుక్కంతోనే పోతున్నారు.

దేవాలయానికి వచ్చే భక్తులందరూ దుఃఖంతో పోతున్నారు.

ఈ ఏడాది మాత్రం భక్తులు సంతోషంగా లేరు..దుఃఖంతో వెళ్తున్నారు.

భక్తులు సంతోషంగా ఉన్నారని మీరు మాత్రమే అనుకుంటున్నారు.. కానీ భక్తులందరూ దుఃఖంతో వెళ్తున్నారు.

మాటల్లో ఉన్నంత…చేతల్లో మాత్రం పనులు లేవు.

నా బిడ్డలు అడపడుచులందరు ఏడుపులతో ఉన్నారు.

మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినా.. నేను మాత్రం గ్రామ ప్రజలను సంతోషంగా చూసుకుంటాను.

ప్రజలకు మేలు చేస్తున్నారు అనుకుంటున్నారు..కానీ మీరు కీడు చేస్తున్నారు.

ప్రజలందరూ శాపాలు పెడుతున్నారు…నేను ఎప్పుడు శాపం పెట్టలేదు.

ప్రజలను సంతోషం గా చూసుకుంటాను. ఆ భాద్యత నాది.

నా ఆశీర్వాదం అందరికి ఉంటుంది…నాకు మాత్రమే మొక్కులు పెట్టడం కాదు.. ప్రజలను సంతోషపెట్టండి.

వచ్చే రోజుల్లో నా భక్తులకు ఇబ్బందులు కాకుండా చూసుకోండి.

న్యాయం ఉన్నంత వరకు నేను న్యాయం పక్షాన్న నిలబడుతా..

కొరినన్ని వర్షాలు ఉన్నాయి..వచ్చే రోజుల్లో వర్షాలు కురుస్తాయి.

పాడి పంటలు బాగా పండుతాయి…

నాకు ఎంత బంగారం పెట్టినా..ప్రజలందరూ సుఖంగా ఉంటేనే నాకు సంతోషం.

Read more RELATED
Recommended to you

Latest news