గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఏ ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ లేని విధంగా రోజులో 3 సార్లు హాజరు తప్పనిసరి చేసే కొత్త విధానం సచివాలయాల్లో నేటి నుంచి అమలులోకి రానుంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇందు కోసం ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చింది. దీన్ని ఉద్యోగులు తమ స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుని.. నేటి నుంచి మూడుసార్లు హాజరు వేసుకోవాల్సి ఉంటుంది.
ఉదయం 10 గంటలలోపు, మధ్యాహ్నం 3 కు, సాయంత్రం 5 గంటలకు హాజరు తప్పనిసరి. సొంత ఫోన్లు లేని వారు సచివాలయాలకు ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకోవాలి. ఈ ఆదేశాలతో ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.
2019 అక్టోబర్ లో విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ 2021 అక్టోబర్ లో ఖరారు చేయాలి. శాఖా పరమైన పరీక్షల్లో చాలా మంది ఉత్తీర్ణులు కాలేదన్న ఉద్దేశ్యంతో.. 2022 జూన్ లో అందరి ప్రొబేషన్ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త రూల్ తీసుకువచ్చారు.