పెద్దల సభకు సంబంధించి ఆంధ్రావని తరుఫున ఇద్దరు మాత్రమే వెళ్లనున్నారు. ఆ మేరకు జగన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా వైసీపీకి అక్కడ దక్కే ప్రాధాన్యం నాలుగు సీట్లున్నా, రెండు తెలంగాణకు రెండు ఆంధ్రాకు కేటాయించడం విశేషం. ఈ తరుణంలో కొన్ని విమర్శలు వస్తున్నా, ఇప్పటికిప్పుడు ఆయన నిర్ణయంలో మార్పు అయితే ఉండదు. ఎప్పటి నుంచో ఒక పేరు అయితే వినిపిస్తోంది కనుక ఆ పేరును కన్ఫం చేశారు. ఆ పేరు నిరంజన్ రెడ్డి. ఆయన జగన్ తరఫున వ్యక్తిగత న్యాయవాది. అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఇప్పటికే సుప్రీం వాకిట వాదనలు వినిపిస్తున్న యువ న్యాయవాది. ఆచార్య సినిమా నిర్మాత కూడా !
ఆచార్య సినిమా ఫలితం ఆయనకు చేదు అనుభవం మిగిల్చినా ఆయన కోరుకున్న విధంగా అనూహ్య ఫలితం అయితే అందుకున్నారు. ఆ విధంగా ఆయన పుట్టి పెరిగిన నిర్మల్ ప్రాంతానికి కూడా ఈ ఎంపిక ఓ విధంగా గర్వకారణమే ! ఆంధ్రా నియామకాల్లో తెలంగాణ ప్రతినిధుల చొరబాటు అన్నది తప్పు అని అది పార్టీకి క్షేమదాయకం కాదని ఇంకొందరు అంటున్నారు.కానీ జగన్ మాత్రం ఎవ్వరి మాట వినేలా లేరు. ఈ నిర్ణయమే కాదు ఏ నిర్ణయం అయినా ఏక పక్షమే !
మరో తెలంగాణ వ్యక్తి, వికారాబాద్ కు చెందిన ఆర్.కృష్ణయ్యకు బీసీ నేతగా పేరుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయనకు ఓ విధంగా ప్రత్యేకించిన వర్గం ఉంది. అనూహ్యంగా ఈ పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి విమర్శలు రేగాయి. అసలు ఆర్.కృష్ణయ్యకు కానీ నిరంజన్ రెడ్డికి కానీ పార్టీ సభ్యత్వమే లేదు. లేనివారికి , ఇంతవరకూ పార్టీ గురించి ఏమీ మాట్లాడని వారికి, పక్కా ప్రాంతేతరులకు ఏ విధంగా పదవులు ఇస్తారని ఓ అసంతృప్త వాదం వినిపిస్తున్నా.. ముందు ప్రస్తావించిన విధంగా ఆయన నిర్ణయం ఇప్పుడూ ఎప్పుడూ ఏక పక్షమే ! కొన్ని సార్లు అంగీకారం కాకున్నా కఠినాత్మకమే!