మ‌రో 17 రోజులు మాత్ర‌మే.. ఆస‌క్తి రేపుతున్న ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019..!

-

ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019లో మొత్తం 10 జ‌ట్లు త‌ల‌ప‌డుతుండ‌గా.. లీగ్ ద‌శ‌లో మ్యాచ్‌ల‌న్నీ రౌండ్ రాబిన్ విధానంలో జ‌ర‌గ‌నున్నాయి.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌.. ఐపీఎల్‌.. 12వ సీజ‌న్ ఎట్ట‌కేల‌కు ముగిసింది. నిన్న‌టితో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌తో ఈ సారి ఐపీఎల్ సీజ‌న్ అయిపోయింది. ఫైన‌ల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగ‌డంతో క్రికెట్ అభిమానుల‌కు మాంచి కిక్కు వ‌చ్చింది. అయితే దేశ‌వాళీ టోర్న‌మెంట్ అయిన ఐపీఎల్ ముగిసినప్ప‌టికీ.. మ‌రో 17 రోజుల్లో మ‌రో టోర్న‌మెంట్ క్రికెట్ అభిమానుల‌ను అల‌రించ‌నుంది. అదే.. ఐసీసీ మెగా ఈవెంట్‌.. క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019. సెమీ ఫైన‌ల్స్‌, ఫైన‌ల్స్ క‌లిపి మొత్తం 48 మ్యాచులు జ‌ర‌గ‌నుండ‌గా.. దాదాపుగా మొత్తం 46 రోజుల పాటు క్రికెట్ అభిమానుల‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ వినోదాన్ని పంచ‌నుంది.

ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019లో మొత్తం 10 జ‌ట్లు త‌ల‌ప‌డుతుండ‌గా.. లీగ్ ద‌శ‌లో మ్యాచ్‌ల‌న్నీ రౌండ్ రాబిన్ విధానంలో జ‌ర‌గ‌నున్నాయి. 27 ఏళ్ల త‌రువాత తొలిసారిగా క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఈ విధానంలో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. రౌండ్ రాబిన్ విధానంలో అన్ని టీంలు ఒక‌దానితో ఒక‌టి త‌ల‌ప‌డాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో మొత్తం 45 మ్యాచులు జ‌రుగుతాయి. త‌రువాత సెమీ ఫైన‌ల్ మ్యాచులు 2, ఫైన‌ల్ ఉంటాయి. అయితే రౌండ్ రాబిన్ విధానంలో మ్యాచుల‌న్నీ ముగిశాక తొలి 4 స్థానాల్లో ఉండే జ‌ట్లు సెమీ ఫైన‌ల్‌కు వెళ్తాయి. ఈ క్ర‌మంలో సెమీ ఫైన‌ల్స్‌లో 1, 4 స్థానంలో నిలిచిన జ‌ట్లు ఒక మ్యాచ్ ఆడితే, 2, 3 స్థానాల్లో నిలిచిన జ‌ట్లు మ‌రో మ్యాచ్ ఆడుతాయి. వాటిల్లో గెలిచిన రెండు జ‌ట్లు ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌తాయి.

కాగా వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్ ఆరంభానికి ముందు జ‌ట్ల‌న్నీ రెండేసీ మ్యాచ్‌ల చొప్పున వార్మ‌ప్ మ్యాచులు ఆడుతాయి. ఈ క్ర‌మంలోనే ఈ నెల 24వ తేదీ నుంచి వ‌రల్డ్ క‌ప్ 2019 వార్మ‌ప్ మ్యాచులు ఆరంభం కానున్నాయి. ఇక భార‌త్ ఈ నెల 25, 28 తేదీల్లో న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల‌తో వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. అలాగే టోర్న‌మెంట్‌లో భార‌త్ జూన్ 5వ తేదీన సౌతాఫ్రికాతో త‌న మొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది. అలాగే చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అయిన పాకిస్థాన్‌తో భార‌త్ జూన్ 16వ తేదీన త‌ల‌ప‌డ‌నుంది. దీంతో ఆ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.. మ‌రి ఐసీసీ క్రికెట్ వ‌రల్డ్ క‌ప్ 2019 ను చూసేందుకు మీరూ సిద్ధ‌మ‌వండిక‌..!

Read more RELATED
Recommended to you

Latest news