మాదాపూర్‌లో వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ ఫేజ్-2 ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 400 కోట్ల రూపాయలతో మూడు ఎకరాల విస్తీర్ణంలో టీ హబ్ ఫేజ్-2 ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ కార్యక్రమంలో ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నరసింహ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించిన అనంతరం.. టీ హబ్-2 ప్రాంగణాన్ని పరిశీలించారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. యూనికార్న్ వ్యవస్థాపకులు, ప్రముఖ అంకుర సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి సన్మానించారు. సీఎం కేసీఆర్‌తో అంకుర సంస్థ ప్రతినిధులు సెల్ఫీలు దిగారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అని పేర్కొన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని వెల్లడించారు. టీ హబ్ స్థాపించాలనే ఆలోచనకు ఎనిమిదేళ్ల కిందే అంకురార్పణ జరిగిందన్నారు. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలని టీ హబ్ ప్రారంభించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. 2015లో మొదటి దశ టీ హబ్‌ను ప్రారంభించామని వెల్లడించారు సీఎం కేసీఆర్. ఏడేళ్ల తర్వాత టీ హబ్ రెండో దశ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఏడేళల్లో టీహబ్ ద్వారా 1200 అంకురాలకు సహకారం అందించినట్లు చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయన్న సీఎం కేసీఆర్.. టీ హబ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు అధికారులను అభినందించారు.