కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రావని, టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కుంకుమ పువ్వును సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలు మాత్రమే తీసుకోవాలని చెబుతుంటారు. అయితే నిజానికి కుంకుమ పువ్వును ఎవరైనా వాడవచ్చు. అందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. కుంకుమ పువ్వు చాలా ఖరీదైందే కానీ.. అది ఇచ్చే ప్రయోజనాలు చాలా విలువైనవి. కుంకుమ పువ్వు వల్ల మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అలాగే పలు ముఖ్యమైన పోషకాలు కూడా దాని వల్ల మనకు లభిస్తాయి. ఈ క్రమంలోనే కుంకుమ పువ్వును వాడడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కుంకుమ పువ్వులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్రోసిన్, క్రోసెటిన్, సఫ్రనాల్, కెంప్ ఫెరాల్ తదితర యాంటీ ఆక్సిడెంట్లు కుంకుమ పువ్వులో ఉంటాయి. వీటి వల్లే కుంకుమ పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది. అయితే ఈ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ డిప్రెసెంట్లుగా కూడా పనిచేస్తాయి. అంటే డిప్రెషన్ తగ్గుతుందన్నమాట. అలాగే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. దీంతోపాటు క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి.
2. నిత్యం 30 మిల్లీగ్రాముల మోతాదులో కుంకుమ పువ్వును తీసుకుంటే డిప్రెషన్ నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కుంకుమ పువ్వు మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడేస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
3. మహిళలు రుతు సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల వారికి ఆ సమయంలో వచ్చే తలనొప్పి, ఆందోళన, విసుగు, ఇతర నొప్పులు తగ్గుతాయి.
4. అంగ స్తంభన సమస్యలు ఉన్నవారు, వీర్యంలో శుక్రకణాలు తక్కువగా ఉన్నవారు నిత్యం 30 మిల్లీగ్రాముల మోతాదులో కుంకుమ పువ్వు తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. సంతానం కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
5. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రావని, టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే కంటి చూపు కూడా పెరుగుతుంది. దీంతోపాటు వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
అయితే కుంకుమ పువ్వును నిత్యం పాలలో గానీ, మనం చేసుకునే వంటలు లేదా అన్నంలోగానీ వేసుకుని తీసుకోవచ్చు. ఇక దీన్ని మోతాదుకు మించి తీసుకోరాదు. తీసుకుంటే గర్భిణీల్లో అబార్షన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక నిత్యం 30 మిల్లీగ్రాముల మోతాదు దాటకుండా ఎవరైనా కుంకుమ పువ్వును జాగ్రత్తగా ఉపయోగించవచ్చు. అయితే కుంకుమ పువ్వును ప్రస్తుతం మార్కెట్‌లో చాలా మంది కల్తీ చేస్తున్నారు కనుక.. బ్రాండెడ్ కంపెనీ అమ్మే కుంకుమ పువ్వును కొనుగోలు చేయడమే ఉత్తమం. ఇక గర్భిణీలు కుంకుమ పువ్వును వాడేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది..!