బతుకు దెరువు కోసం తెలంగాణకు వచ్చింది ఆ జంట. పనిచేసే చోట పరిచయమైన వ్యక్తితో ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరు ఏకాంతంగా కలిసి ఉండటం చూసిన భర్త ఆమెను మందలించాడు. అతడిపై కోపం పెంచుకున్న ఆమె ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. కానీ తాగిన మైకంలో ప్రియుడు.. ఆ విషయాన్ని అందరి దగ్గర వాగేశాడు. ఇంకేం పోలీసులకు దొరికిపోయి ఇద్దరు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టి మండలం ఇటుకల పహాడ్‌లో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. అటవీశాఖ ప్లాంటేషన్‌లో కూలీ పనుల కోసం దేవేందర్, పార్వతి అనే దంపతులు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. ఈ క్రమంలో అక్కడే పార్వతికి రామ్‌లాల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అది కాస్తా ప్రేమగా మారింది. గత ఆదివారం భార్య పార్వతి ప్రియుడు రామ్‌లాల్‌తో ఏకాంతంగా ఉండడం చూసి భర్త దేవేందర్ పార్వతిని మందలించాడు.
ప్రశ్నించిన భర్తను భార్య పార్వతి ప్రియుడితో కలిసి కర్రతో బాది గొంతునులిమి హత్య చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత.. తాగిన మైకంలో ఈ విషయాన్ని రామ్ లాల్ తన తోటి కూలీలతో చెప్పాడు. ఆ కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం బయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.