తెలంగాణలో రాజకీయ రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్న వేళ.. రాష్ట్ర రాజకీయం అక్కడ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నేడు టీఆర్‌ఎస్ మునుగోడు ప్రజాదీవెన పేరిట బహిరంగ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తున్నామన్నారు. చేనేత, గీత, యాదవులు అందరినీ ఆదుకున్నామని, ఏ వర్గాన్నీ కాదనకుండా ప్రతివాళ్లను కడుపులో పెట్టుకొని ఒక దారికి తెచ్చుకోవాలని పాటుపడుతున్నామన్నారు. వాళ్లను కాదని మనల్ని పోటు పొడిచేవాళ్లకు ఓటు వేస్తే మనకు దెబ్బపడుతుంది కాబట్టి.. మీ బిడ్డగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం నా ధర్మం కాబట్టి అందరికీ ఈ విషయం మనవి చేస్తున్నా అన్నారు సీఎం కేసీఆర్. క్రియాశీల శక్తులు, ప్రగతి శీల శక్తులు అందరం ఒక్కటై ముందుకు సాగాలన్నారు సీఎం కేసీఆర్. కార్మికులను, కర్షకులను, సామాన్య ప్రజలను కాపాడటం కోసం కంకణ బద్దులమై ఈ దేశం నుంచి బీజేపీ వాళ్లను, ఈ పెట్టుబడుదార్ల ప్రభుత్వాన్ని తరిమికొడితేనే మనకు విముక్తి దొరుకుతుందన్నారు సీఎం కేసీఆర్. మన మునుగోడులో గిరిజనులు ఉన్నారని, మా తండా మా సర్పంచ్ కావాలి మాది మాకు అని 50 ఏళ్లు మొత్తుకుంటే ఎవరైనా చేశారా? కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే మూడున్నర వేల గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసినమన్నారు. ఇప్పుడు గిరిజన బిడ్డలే రాజ్యం ఏలుతున్నారని, నేను చెప్పేవి గాలి మాటలు కాదు. మీ కళ్ల ముందు ఉన్నవే.
కాబట్టి అలవోకగా ఏమరుపాటుగా ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయి కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. పెద్ద మెజార్టీతో గెలిచి ఎవరు ముందుకు పోతారో వాళ్ల మెసేజ్ దేశానికి పోతుంది. ఆనాడు అటుకులు తిన్నమో, ఉపవాసం ఉన్నమో పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ తెచ్చినం. తెచ్చిన తెలంగాణను ఒక లైన్‌లో పెట్టుకుంటున్నాం. తిప్పలు పడుతున్నం. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఇవాళ మనకు లెఫ్ట్ పార్టీల మిత్రులు మనకు మద్దతుగా వచ్చారు. ఈ ఎన్నిక ఒక వ్యక్తి కోసమో, పార్టీ కోసమో జరిగేది కాదు. క్రియాశీల, ప్రగతిశీల పార్టీల నాయకత్వంలో బ్రహ్మాండమైన సందేశాన్ని దేశానికి ఇచ్చి ప్రజలను చైతన్యం చేసే తీర్పే మునుగోడు నుంచి వచ్చేలా కృషి చేయాలి’’ అని అన్నారు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, మన జీవితాల ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక అని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రేపు ఏమంటడు నరేంద్ర మోదీ.. కేసీఆర్ నేను మీటర్లు పెట్టుమన్న.. నువ్వు పెడుతలేవు.. అయినా మునుగోడులో నాకే ఓటు వేశారు.. నువ్వు జరుగు అని పక్కకు నూకేసి తెచ్చి మీటర్లు పెడుతడు. మీటర్లు పెట్టే నరేంద్ర మోదీ బీజేపీ కావాలా.. మీటర్లు వద్దనే టీఆర్‌ఎస్ కేసీఆర్ కావాలా?. ఈ విషయంపై గ్రామాల్లో చర్చ జరగాలి? ఎవరు కావాలో చర్చించాలి. గ్రామంలో విద్యావంతులు, యువకులు, పెద్దలు, రైతుబంధు పొందుతున్న లక్ష మంది రైతులు చర్చించాలి’ అని అన్నారు సీఎం కేసీఆర్.