ఆడపులిని కొట్టి చంపేసారు- వీడియో

-

తమ గ్రామం మీద దాడి చేసి, ఒకరిని గాయపరిచిందని ఊరంతా ఏకమై ఒక ఆడపులిని దారుణంగా కొట్టి చంపారు. పైగా కొడుతున్నప్పుడు విడియో తీసి, దానికి వ్యాఖ్యానం కూడా జతచేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసారు.

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ జిల్లాలో, ఓ ఆడపులిని కొట్టిచంపిన దుశ్చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతవారం జరిగిన ఈ దారుణానికి దృశ్యరూపం విడియోలా బయటికి వచ్చి చాలామందిని బాధపెట్టింది.

రాజధాని లక్నోకు దాదాపు 240 కి.మీల దూరంలో ఈ పిలిభిత్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఉంది. దీనికి దగ్గర్లోని మైతనా అనే గ్రామంలో ఈ ఘోరకాండ జరిగింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ దారుణాన్ని మొత్తం మొబైల్‌లో విడియో తీసి, తమ గ్రామంలోని ఓ వ్యక్తిని ఈ పులి గాయపర్చిన కారణాన, కొట్టి చంపుతున్నామని వ్యాఖ్యానం కూడా చేసాడు. మొన్న జరిగిన బుధవారం ఉదయం ఒక గ్రామస్థుడిని పులి గాయపర్చడంతో, ఆగ్రహోదగ్రులైన గ్రామస్థులు, మధ్యాహ్నం ఈ మారణకాండకు తెరతీసారు.

Tigress Beaten To Death In UP, Villagers Make Video With Commentary,

ఆరు సంవత్సరాల వయసు గల ఈ ఆడపులి ఒంటి నిండా తీవ్రగాయాలతో పాటు, పక్కటెముకలు కూడా విరగడంతో మరణించింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఖననం చేసారు. ఆ పులుల అభయారణ్య డైరక్టర్‌ రాజమోహన్‌ ఇయాన్స్‌ వార్తాసంస్థతో మాట్లాడుతూ, పులి దేహమంతా గాయాలతో నిండిఉన్నదన్నారు. ఈటెల్లాంటి పదునైన ఆయుధాలతో పొడిచినందున తీవ్రగాయాలైనాయని, కట్టెలతో విచక్షణారహితంగా కొట్టడంవలన పక్కటెముకలు విరిగాయని తెలిపారు. అందిన సమాచారం ప్రకారం, దాడి జరిగిన కొద్దిసేపటికే అటవీసిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నా, కోపంగా ఉన్న గ్రామస్థులు అది చనిపోయేదాకా, అసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించలేదు.

పిలిభిత్‌ జిల్లా కలెక్టర్‌ వైభవ్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ, సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి విపరీతమైన నొప్పితో పులి విలవిలలాడుతోంది. మత్తు ఇంజెక్షన్‌ ఇద్దామనుకున్నా, అది ఇంకా ఎక్కువగా ప్రమాదంలోకి నెట్టే అవకాశముందన్నారు. గాయపడిన పులిని రక్షించేందుకు అటవీసిబ్బంది సిన్సియర్‌గా కృషి చేసారా లేదా అనేది తెలుసుకోవడానికి మెజీస్టీరియల్‌ దర్యాప్తుకు ఆదేశించామన్నారు.

2012నుండి ఆ అభయారణ్యంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో 16 పెద్దపులులు, 3 చిరుతలు మృత్యువాతపడ్డాయని ఇయాన్స్‌ వార్తాసంస్థ తెలిపింది. ఇందులో అధికభాగం విషప్రయోగం, ఉచ్చులు, అంటువ్యాధుల వల్ల జరిగాయని, కొన్ని మాత్రమే వాటిలో అవి తలపడి చనిపోయాయని సమాచారం. బుధవారం నాటి ఘటన మాత్రం మొట్టమొదటిదని ఇయాన్స్‌ తెలిపింది.

దుధ్వా టైగర్‌ రిజర్వ్‌ మాజీ డైరెక్టర్‌ జీసీ మిశ్రా మాట్లాడుతూ, అటవీ సిబ్బంది సకాలంలో సంఘటనాస్థలికి చేరుకున్నా, పులిని రక్షించలేకపోవడం విచారకరం. కానీ దాదాపు తొమ్మిదిగంటల సమయమున్నా, వారు ఆ పులికి వైద్యసహాయం అందజేయడంలో అలసత్వం ప్రదర్శించారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో వారు నిర్వహించాల్సిన విధులను నిర్లక్ష్యం చేయడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news