హైదరాబాద్ మహానగరంలో మరో అంతర్జాతీయ క్రికెడ్ స్టేడియం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ప్రభుత్వ క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయకు ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలో క్రికెట్ మరింత విస్తరించేలా.. తెలంగాణ నుంచి మెరుగైన క్రీడాకారులను తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బలోపేతం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.హెచ్‌సీఏ విస్తరణకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాతో సమీక్ష నిర్వహించారు. 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను తక్షణమే ఏర్పాటు చేసి తద్వారా జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో పాటు 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్రికెట్ క్లబ్‌ల ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రికెట్ క్లబ్‌లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు.