ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మోడీ పర్యటనపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ పర్యటనలో కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ రెండో స్థానంలో వచ్చినందుకు రాష్ట్ర బీజేపీ క్యాడర్ లో బలం పెంచుకునేందుకు మోడీ వచ్చారని విమర్శించారు నారాయణ. సింగరేణిని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పట్లో నేరుగా ప్రైవేటీకరణ చేయలేకపోయినా.. భవిష్యత్తులో నిర్వీర్యం చేయనున్నారని నారాయణ ఆరోపించారు.
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటే.. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉండడం వల్ల నేరుగా ప్రైవేటు పరం చేయకుండా.. నాలుగు బ్లాక్స్ ను ప్రైవేటు పరం చేశారని అన్నారు నారాయణ. సింగరేణి పరిధిలోని బ్లాక్స్ లో బొగ్గు నిల్వలు అయిపోయాక.. ఉత్పత్తి తగ్గిపోయి.. ఆటోమేటిగ్గా సింగరేణి చచ్చిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు నారాయణ. దేశం మొత్తం కొత్త మైన్స్ ను ప్రైవేట్ వాళ్లకు అప్పజెబుతున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటించినా.. విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ పోలీసులను ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగించారనే అనుమానం వస్తుందని
ఆరోపించారు నారాయణ.