రైల్లో 20 కేజీల గంజాయి స్మగ్లింగ్‌.. చివరికి

-

రోజు రోజుకు స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రజా రవాణా వ్యవస్థలోనే మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకు పూనుకుంటున్నారు. తాజాగా.. రైల్లో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 4 లక్షల విలువ చేసే 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం సికింద్రాబాద్‌ రైల్వే పోలీసు స్టేషన్‌లో ఇన్‌స్పె్క్టర్‌ ఎం. శ్రీను వివరాలను వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన శైలేంద్ర కుమార్‌ (33) వృత్తి రీత్యా కూలీ పని చేసుకుంటూ ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేశాడని తెలిపారు. వాటిని ప్యాక్‌ చేసి మధురకు దూరంతో ఎక్స్‌ప్రెస్‌ రైల్లో తరలిస్తూ ఈ నెల 20న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడని వివరించారు.

రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారం ఒకటి వద్ద రైల్వే ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేస్తుండగా నిందితుడు శైలేంద్రకుమార్‌ అనుమానస్పదంగా కనిపించడంతో అతని వద్ద ఉన్న బ్యాగ్‌లను తనిఖీలు చేశారని చెప్పారు. బ్యాగ్‌లలో 20 కిలోల గంజాయిని గుర్తించిన రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఈసమావేశంలో ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహ, ఎస్‌ఐ ఎం.ఎ మజీద్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news