తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెడ్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిఫారసు చేయాల్సిందిగా కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సర్కారు ఇప్పటికే లేఖ రాసింది.
ఉభయసభలు ఇంకా ప్రొరోగ్ కాకపోవడంతో గతంలో జరిగిన సమావేశాల కొనసాగింపుగానే ఈమారు కూడా శాసనమండలి, శాసనసభను సమావేశపరుస్తున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేస్తూ గవర్నర్ తమిళిసై ఇంకా అనుమతి ఇవ్వలేదు.
సమావేశాల తేదీ దగ్గర పడుతున్నా గవర్నర్ అనుమతి రాకపోవడంతో ఏం చేయాలన్న విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు ఇందుకు సంబంధించి సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయమై ఇవాళ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.