మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా నేడు దేశ వ్యాప్తంగా గాంధీజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు నిర్వహించడమేంటని.. గాంధీ జయంతి రోజున ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇస్తున్నారని ప్రభుత్వంపై చంద్రబాబు ద్వజమెత్తారు. పోలీసులను పెట్టి మరీ మద్యం అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే చట్టాలను చుట్టాలుగా మార్చుకొని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఎవరి విశ్లేషణకూ అర్థంకాని రీతిలో జగన్ వ్యవహారశైలి ఉందని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయాలను 2003లోనే ప్రారంభించామని, ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అలాగే పేదలకు అన్నం పెట్టే అన్నక్యాంటీన్లను మూసేశారని ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.