ఈ మధ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్నాయి. ఎప్పుడైతే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని బయటకు రావడం, అటు బిఆర్ఎస్ పార్టీ సైతం సస్పెండ్ చేయడంతో సీన్ మారిపోయింది. ఒక్కసారిగా ఖమ్మంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో జిల్లాపై బిఆర్ఎస్ ఫోకస్ పెట్టడం, పొంగులేటి వెళ్లిపోవడంతో బిఆర్ఎస్ నేతలు అలెర్ట్ అయ్యారు. జిల్లాపై పట్టు తప్పకూడదనే ప్రయత్నాలు చేస్తున్నారు.
అటు కాంగ్రెస్ పార్టీ సైతం జిల్లాపై పట్టు వదలకుండా ముందుకెళుతుంది. మొదట నుంచి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. గత ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు సాధించింది. వచ్చే ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. తాజాగా రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీ జరిగింది..దీనికి ప్రజా మద్ధతు బాగానే వచ్చింది. దీంతో కాంగ్రెస్ మరింత దూకుడుగా వెళుతుంది. ఇక ఉమ్మడిజిల్లా రాజకీయాల్లో కీలకమైన పటిష్ఠ ఓటుబ్యాంటు కలిగిన వామపక్షాల ముఖ్యనేతలైన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు ఉమ్మడి జిల్లా వారే కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి తమ సత్తా చాటాలని కమ్యూనిస్టులు చూస్తున్నారు.
అయితే మునుగోడు ఉపఎన్నికల వేదికగా అధికారపార్టీకి దగ్గరైన సీపీఎం, సీపీఐ వచ్చే ఎన్నికల్లో పొత్తుల ద్వారా తమకు తగ్గట్టుగా సీట్లు అడిగే అవకాశం ఉంది. సీపీఎం పాలేరు, మధిర, భద్రాచలంపై గురిపెట్టగా, సీపీఐ కొత్తగూడెం, వైరా స్థానాలపై దృష్టిపెట్టింది. ఈ రెండు పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి.
ఖమ్మం జిల్లాపై బీజేపీ కేడర్ కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో వచ్చేనెల మొదటి వారంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడ బండి సంజయ్ పర్యటన ఉంటుందని ఆయన నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొంటారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాల్లోని అసంతృప్త నేతలను పార్టీలోకి రప్పించి.. వచ్చేఎన్నికల్లో బలాన్ని పెంచుకోవాలని బీజేపీ చూస్తుంది. ఇదే సమయంలో మాజీ ఎంపీ పొంగులేటి తన వర్గంతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఏపీ సిఎం జగన్‌ని కలిశారు..మరి ఈయన కాంగ్రెస్ లోకి వెళ్తారా? లేక బిజేపిలోకి వెళ్తారో చూడాలి. లేదా కొత్త పార్టీ పెడితే ఖమ్మంలో చతుర్ముఖ పోటీ ఉంటుంది. చూడాలి మరి ఈ సారి ఖమ్మంలో ఎన్నికల ఫైట్ ఎలా ఉంటుందో.