ఏపీలో అధికార వైసీపీలో నాలుగు నెలలకే చాలా మంది నేతల మధ్య పొసగని పరిస్థితి నెలకొంది. ఈ లిస్టులో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన నేతలే ఎక్కువుగా ఉన్నారు. ఈ నేతల మధ్య సమన్వయం కోసం జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎవ్వరూ ఆయన మాట పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. కొద్ది రోజుల క్రితమే నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్సెస్ సర్వేపల్లి ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి మధ్య పెద్ద వివాదం చెలరేగింది. అప్పటికే వీరిద్దరి మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న వివాదం ఎంపీడీవో కోటంరెడ్డిపై కేసు పెట్టడంతో మరికాస్త పెద్దది అయ్యింది. చివరకు కోటంరెడ్డి తన అరెస్టు ప్రమేయం వెనక కాకాణి ఉన్నారని సందేహాలు వ్యక్తం చేసే వరకు వెళ్లింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారశైలిపై స్వపక్షంలోని ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రెడ్లదే పెత్తనం. అక్కడ రెడ్లను కాదని మిగిలిన కులాలు రాజకీయ అధికారం చెలాయించడం చాలా కష్టం. అంతెందుకు గత టీడీపీ ప్రభుత్వంలో కాపు వర్గానికి చెందిన మంత్రి నారాయణ ఆధిపత్యాన్నే వాళ్లు అస్సలు సహించలేకపోయారు. ఇక సోమిరెడ్డి మంత్రి అయ్యాక కాని వాళ్ల మనస్సు కాస్త కుదుట పడలేదు.
ఇక ఇప్పుడు చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేల కంటే జూనియర్ అయిన అనిల్‌కు మంత్రి పదవి ఇవ్వడం వాళ్లకు రుచించడం లేదు. ముందు జూనియర్ కదా మనమాట జవదాటడు అనుకున్న వాళ్లకే ఇప్పుడు అనిల్ దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నాడని అంటున్నారు. సిటీ, రూరల్ నియోజకవర్గాల పెత్తనమంతా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన అప్పగించేశారట. ఆనం, కాకాణి లాంటి వారిని సైతం వారి నియోజకవర్గాలకే పరిమితం చేశారని పలువురు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిగిలిన నియోజకవర్గాలకు చెందిన నేతలు, సీనియర్లు ఏ పని మీద వెళ్లినా మంత్రి అనిల్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఆయనపై సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అనిల్ పాల్గొంటోన్న కార్యక్రమాలకు సైతం వాళ్లు డుమ్మా కొట్టేస్తున్నారు. ఇక అనిల్ చుట్టూ ఉన్న కోటరి నేపథ్యంలో సైతం ఆయన దగ్గరకు వెళ్లేందుకు చాలా మంది నానా ఇబ్బందులు పడుతున్నారన్న మరో టాక్ కూడా బయటకు వచ్చేసింది. ఇక అనిల్ తీరు మార్చుకోకపోతే నెల్లూరు వైసీపీ రెడ్లు అదను చూసి దెబ్బేసేందుకు రెడీగా ఉన్నట్టు నెల్లూరు పాలిటిక్స్‌లో చర్చ నడుస్తోంది. మరి అనిల్ ఏం చేస్తాడో ? చూడాలి.