నీటిని సద్వినియోగం చేసుకొని వాణిజ్య పంటలు వేస్తే రాయలసీమ రతనాలమయం అవుతుందని, రాయలసీమ సమస్యలపై సంపూర్ణమైన అవగాహనతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మాట్లాడిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు వైసీపీ ఎంపీ రఘురామ. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థిగా, ప్రపంచ దేశాలు తిరిగిన వ్యక్తిగా రాయలసీమ ప్రాంత సమస్యలను ఆకలింపు చేసుకుని, ఆయన అద్భుతమైన ప్రసంగాన్ని చేశారని అన్నారు.
రాయలసీమ ప్రాంతంలో నీటి లభ్యతను పెంచి తుంపర సేద్యం ద్వారా గణనీయంగా పంట రాబడిని పెంచుకోవచ్చునని లోకేష్ గారు వివరించిన విధానం బాగుందని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని అమలు చేసి చూపించారని, ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టారని, అయితే ఈ ప్రభుత్వంలో డ్రిప్ లేదు… ఇరిగేషన్ లేదు అని అన్నారు.
వాణిజ్య పంటలు పండించడంతో పాటు వాటి మార్కెటింగ్ కు అనువైన రవాణా సౌకర్యాన్ని పెంపొందించడం ద్వారా రైతులను ధనవంతులను చేయవచ్చునని, రోడ్డు కనెక్టివిటీతో పాటు, రైలు కనెక్టివిటీ పెంచాలని, రోడ్డు కనెక్టివిటీని రైల్వేకు అనుసంధానం చేస్తే రవాణా సౌకర్యం సులభతరం అవుతుందని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో నారా లోకేష్ గారికి అనూహ్య ప్రజాదరణ లభిస్తుందని, రాయలసీమ అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాములో సాగునీటి ప్రాజెక్టులు ప్రగతి పథంలో నడిచాయని, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కాయని అన్నారు.