రిషబ్ పంత్… టీం ఇండియా యువ సంచలనం… గత ఏడాది ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ తర్వాత అతని గురించి మాట్లాడిన మాట అది… ఆ సీరీస్ లో చివరి టెస్ట్ లో కెఎల్ రాహుల్ తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని అతను సాధించిన సెంచరి అతని కెరీర్ లో నిలిచిపోతుంది. అదే ఊపులో ఆసిస్ లో అడుగు పెట్టాడు ఈ యువ ఆటగాడు. స్లెడ్జింగ్ కి ఆసిస్ పెట్టింది పేరు అయితే… వికెట్ల వెనుక ఉండి ఆ జట్టు కీలక ఆటగాడిని అతను చేసిన స్లెడ్జింగ్ సంచలనం అయింది… సోషల్ మీడియాలో అప్పుడు 22 ఏళ్ళ యువ క్రికెటర్ పేరు మారుమోగిపోయింది..
మరి అక్కడి నుంచి ఏమైందో ఏమో… హిట్టర్ గా పేరున్న ఈ కుర్ర క్రికెటర్… దూకుడుగా ఆడలేకపోతున్నాడు. అతని సామర్ధ్యం తెలిసిన కోహ్లి అతనికి చాలానే అవకాశాలు ఇచ్చాడు… దాదాపు అన్ని మ్యాచుల్లో అతనికి అవకాశం ఇచ్చాడు. టెస్టుల్లో ఒక సెంచరి రెండు 90 లతో అతని ప్రతిభ ఏంటి అనేది దగ్గరి నుంచి చూసిన కోహ్లి ఎన్ని విమర్శలు వచ్చినా పంత్ ని వదిలిపెట్టలేదు. అయితే సఫారీలతో నెల క్రితం జరిగిన టెస్ట్ సీరీస్ లో మాత్రం అతన్ని తప్పించాడు కోహ్లి… అయినా టి20 సీరీస్ కి అతన్ని తుది జట్టులోకి తీసుకున్నాడు.
అప్పటి నుంచి ఆడిన ప్రతీ మ్యాచ్ లో దాదాపుగా పంత్ ఉన్నాడు. అయినా సరే ఈ యువ ఆటగాడు తనను తాను నిరూపించుకోలేకపోతున్నాడు. క్రీజ్ లోకి వచ్చిన వెంటనే అతను భారీ షాట్లు ఆడటం, అనవసర బంతిని కెలికి వికెట్ పారేసుకోవడం… మొన్న విండీస్ తో జరిగిన చివరి టెస్ట్ లో అతను ఆడిన షాట్ చూసి చాలా మంది విమర్శలు చేసారు. అవకాశాలు రాని వారు రాక ఏడుస్తుంటే వచ్చి ఇలా ఆడతాడు ఏంటీ అని సోషల్ మీడియాలో విమర్శలు చేసారు. ధోని వారసుడిగా అతన్ని కీర్తించిన వారే… చివరికి అతన్ని జట్టులో వద్దన్నారు.
ఆదివారం నుంచి విండీస్ తో జరగనున్న వన్డే సీరీస్ లో పంత్ ఉన్నాడు… తుది జట్టులో అతను స్థానం దక్కించుకునే అవకాశాలే ఎక్కువ. గంగూలీ మద్దతు ఉండటంతో కోహ్లీ కూడా అతన్ని పక్కన పెట్టె అవకాశం తక్కువ. కోచ్ రవి శాస్త్రికి కూడా అతనిపై నమ్మకం ఉంది… దీనితో తుది జట్టులో అతను ఉంటాడు కాబట్టి… ఏ స్థాయిలో అతని ప్రదర్శన ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సీరీస్ లో అతను ఆడకపోతే మాత్రం తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. టీం ఇండియా గిలిక్రిస్ట్ అవుతాడు అని వ్యాఖ్యానించిన క్రీడా పండితులు కూడా అతని ఆట చూసి జుట్టు పీక్కునే పరిస్థితి వచ్చి౦ది. మరి ఈ సీరీస్ లో ఏ విధంగా అడతాడో చూడాలి.