జనసేన రాజకీయాలు తలో దిక్కుగా ఉన్నాయా? పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ది ఒక దారి అయితే, ఆయన కుటుంబానికి మరో దారిగా ఉందా? ముఖ్యంగా పెద్దన్న చిరంజీవి పవన్‌తో తీవ్రంగా విభేదిస్తున్నారా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తే.. ఔననే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఏపీలో ఏర్పడిన జగన్ ప్రభుత్వాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎంగా జగన్ తీసుకుంటు న్నప్రతి నిర్ణయాన్నీ ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇసుక నుంచి ఉల్లిపాయల వరకు, అమరావతి నుంచి పింఛన్ల వరకు ఇలా ప్రతి విషయంలోనూ జగన్‌నుతీవ్రంగా విభేదిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు. ఆందోళనలు, దీక్షలు కూడా చేశారు. మున్ముందు చేసేందుకు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుం టున్నారు.
మరి ఈ సమయంలో పవన్‌కు పార్టీ నుంచి ఎంత మేరకు అండ లభిస్తోంది? ఎవరెవరు ఆయనను, ఆయన ఆందోళనలను, దీక్షలను సమర్థిస్తున్నారు? అనే ప్రశ్న వచ్చినప్పుడు కేవలం కొద్ది మంది మాత్రమే పవన్‌ను సమర్ధిస్తున్నారు. కీలకమైన నాయకులుగా పేరు తెచ్చుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు ఎక్కడా కనిపించడం లేదు. వాయిస్ కూడా వినిపించడం లేదు. ఇక, నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు మాత్రం ఇటీవల అమరావతి విషయంలో జరిగిన ఆందోళనకు, ఇసుక ర్యాలీకి, రైతుల సౌభాగ్య దీక్షకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఎవరూ కూడా బలమైన వాయిస్ వినిపించేవారు కార్యకర్తలను, పార్టీ శ్రేణులను నడిపించేవారు కూడా కనిపించడం లేదు.
పరిస్థి తి ఇలా ఉంటే పార్టీ ఎలా బలపడుతుందని ఒకపక్క మేధావులు ప్రశ్నిస్తుంటే.. మరోపక్క, పవన్‌కు పెద్దన్న, తెలుగు సినీ అభి మానులకు అన్నయ్య అయిన మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ఏకంగా జగన్ ప్రభుత్వాన్ని మోసేస్తున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన ప్రత్యక్షంగానే సమర్ధిస్తున్నారు. గతంలో పవన్ ఇసుక ర్యాలీకి సిద్ధమైన తరుణంలో సతీసమేతంగా వచ్చిన చిరంజీవి తాడేపల్లిలో జగన్ దంపతులను కలిసి సన్మానించి వెళ్లారు. ఇక, ఇప్పుడు రాజధాని విషయంలో మూడు ముక్కలు చేసి, మూడు ప్రాంతాలను డెవలప్ చేయడం ద్వారా వికేంద్రీకరణ చేస్తామని, ఫలితంగా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన జగన్ వ్యాఖ్యలకు పూర్తి మద్దతిచ్చారు.
మరోపక్క, పవన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదేసమయంలో చిరు ఇలా సమర్ధించడాన్ని చూస్తే.. అసలు పవన్ ఏకాకి అయ్యారా? లేక రాజకీయ అనుభవం లేక ఇలా ప్రతి విషయాన్నీ విమర్శిస్తున్నారా? అదీకాక.. ఎవరైనా సీనియర్ నాయకుడి మాయలో పడి ఆయన చెప్పినట్టు జగన్‌పై విమర్శలు చేస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. ముందు ఈ విషయంలో పవన్ క్లారిటీ ఇస్తేనే తప్ప బలమైన ప్రభావం చూపించే చిరంజీవి వ్యాఖ్యల ప్రభావం నుంచి తన పార్టీని, అభిమానులను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి తమ్ముడు ఏం చేస్తాడో చూడాలి.