ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో అనేక ఎన్నికలు జరిగిన సమయంలో ఆయా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్త గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అంతెందుకు 2014 ఎన్నికల్లో మోడీని ప్రధానమంత్రిగా చేయడానికి ప్రశాంత్ కిశోర్ డిజిటల్ ఎన్నికల ప్రచారాన్ని తెరపైకి తెచ్చి మోడీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టారు. కాగా మొన్నటివరకు జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త గా పని చేయడం వల్ల జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్…ప్రశాంత్ కిషోర్ ని సస్పెండ్ చేశారు. దీంతో బీహార్ రాష్ట్రంలో జెడియు కి మరియు దేశవ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేకంగా పనిచేయటానికి రెడీ అయిన ప్రశాంత్ కిషోర్ కి బంగారం లాంటి గిఫ్ట్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. విషయంలోకి వెళితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి ప్రశాంత్ కిషోర్ ని రాజ్యసభకు పంపించాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం.
ఇదే సమయంలో త్వరలో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరగనున్న క్రమంలో మమతా బెనర్జీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ నుండి కచ్చితంగా ప్రశాంత్ కిషోర్ రాజ్యసభకు వెళితే ఇది వైయస్ జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ కి ఇవ్వలేని బంగారంలాంటి గిఫ్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు అంటే దానికి కారణం ప్రశాంత్ కిషోర్. అటువంటి ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని అనుకున్న తరుణంలో అత్యధిక స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి కాక పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు వెళ్లే ఏర్పాటు మమతా బెనర్జీ చేయడమనేది నిజంగా గొప్ప విశేషమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.