10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కలిపేసి 4 బ్యాంకులుగా మార్చేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసిన నేపధ్యంలో ఏప్రిల్ 1న బ్యాంకులు విలీనం కానున్నాయి. బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియ పూర్తైతే 2017లో 27 గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 కు తగ్గుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-OBC, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI, కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనం కానున్నాయి.
అయితే విలీనం జరిగితే తమ డబ్బు పరిస్థితి ఏంటీ అనేది చాలా మంది ఆలోచన. కాని రాత్రికి రాత్రే బ్యాంకు లు విలీనం అయ్యే అవకాశం ఉండదు. ఖాతాల విషయంలో ఏవైనా మార్పులు ఉంటే కస్టమర్లకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాయి బ్యాంకు లు. మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్ కొన్ని రోజుల వరకు వాడుకునే అవకాశం ఉంటుంది. విలీనం అయిన బ్యాంకులో ఆ బ్యాంకు పేరుతో పాస్ బుక్స్, ఏటీఎం కార్డులు వస్తాయి.
ఖాతాదారులే నేరుగా వెళ్లి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉన్న బ్రాంచ్‌లోనే బ్యాంకింగ్ సేవలు అన్నీ పొందే అవకాశం ఉంటుంది. అకౌంట్ బ్యాలెన్స్ లిమిట్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. రుణాలకు సంబంధించి నియమనిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కూడా స్వల్ప మార్పులు ఉంటాయి. ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఆటో డెబిట్ ఫామ్స్ మళ్లీ ఇవ్వాలి.
మీ అకౌంట్‌లో డబ్బులు సురక్షితంగానే ఉంటాయి. బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారుతుంది. ఉచిత సేవలు, ఛార్జీలు, డిపాజిట్లకు, రుణాలకు వడ్డీ రేట్లు, మినిమం బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోండి. బ్యాంకుల విలీన౦ జరిగే సమయంలో నకిలీ ఇమెయిల్స్, లెటర్స్ సర్క్యులేట్ అయ్యే అవకాశాలు ఉన్న నేపధ్యంలో… ఎట్టిపరిస్థితుల్లో మీ అకౌంట్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ, పిన్, కార్డు వివరాలు ఎవరికీ వెల్లడించకూడదు.