నిన్న మొన్నటి వరకు బెజవాడ రాజకీయం వైసిపి వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా ఉండగా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా లోనే అతిపెద్ద ఆధిపత్య పోరు బయటపడింది. ఏపీ రాజకీయాల్లో బెజవాడ రాజకీయం చాలా కీలకం. ఇటువంటి బెజవాడలో గత సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ మరియు సెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. రాజధానికి సమీప ప్రాంతమైన చంద్రబాబు సామాజిక వర్గ ప్రజలు ఎక్కువ ఉన్నా గాని వైకాపా ఎక్కువ స్థానాలు ఇక్కడ సాధించటం నిజంగా విశేషం. ఇటువంటి బెజవాడ రాజకీయాల్లో కీలకంగా రాణించారు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు. వెల్లంపల్లి శ్రీనివాస్ వైశ్య సామాజికవర్గానికి చెందిన నాయకుడు. ఇక మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు. ఇద్దరికీ వైయస్ జగన్ కీలకమైన పదవులు అప్ప చెప్పడం జరిగింది.
దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ రాణిస్తుండగా, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా మల్లాది విష్ణు రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో విజయవాడలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఇద్దరు నాయకులు ఈగోల కి, పంతాలకి పోతు పార్టీ పరువు తీస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. దీంతో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీలోనే రెండు వర్గాలు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నట్లు బెజవాడ రాజకీయాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.