కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజుల ఇండ్లకే పరిమితమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే.. అనేక మంది ఈ వ్యాధిపై ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు. తమకు పుట్టబోయే బిడ్డకు కూడా కరోనా వస్తుందా.. తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అని కంగారు పడుతున్నారు. అయితే ఇలాంటి వారికి వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. అలాగే లాక్‌డౌన్ సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వైద్యులు వివరిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* గర్భిణీలు తమకు పుట్టబోయే బిడ్డకు కరోనా వస్తుందేమోనని భయపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే.. తల్లికి కరోనా సోకితేనే బిడ్డకు ఆ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుందని, అది రానప్పుడు భయపడాల్సిన పనిలేదని అంటున్నారు.
* కరోనా నేపథ్యంలో సాధారణ వ్యక్తుల కన్నా గర్భిణీలు ఇంకాస్త ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. తరచూ చేతులను హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఇల్లు వదిలి బయటకు వెళ్లకూడదు. తప్పనిసరి అయితే విధిగా మాస్క్ ధరించాలి.
* గర్భిణీలు బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలి.
* గర్భిణీలు తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వీలైనంత వరకు ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అలాగే శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తినాలి.
* ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చేవారు ఉంటే.. గర్భిణీలు వారికి దూరంగా ఉండాలి.
* గర్భిణీలు నిత్యం నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే ఇల్లు, ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
* భోజనం చేసిన అనంతరం తేలికపాటి వ్యాయామాలు చేయాలి. సాధారణ వాకింగ్ చేయవచ్చు. అది కూడా ఇంటి వద్దే చేస్తే ఉత్తమం. బయటకు వెళ్లకూడదు.
* గర్భిణీలు వీలైనంత వరకు ఆందోళన చెందకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కరోనా విషయంలో అనవసర భయాందోళనలు, అపోహలు పెట్టుకోవద్దు.
* బీపీ, షుగర్ పరికరాలతో ఇంట్లోనే ఆయా పరీక్షలు నిర్వహించుకోవాలి. ఏదైనా తేడా ఉంటే తరచూ వారు సంప్రదించే డాక్టర్‌ను ఫోన్‌లోనే సంప్రదించాలి. అవసరం ఉన్న మేర మందులను వాడుకోవాలి. ఇక డాక్టర్లు అంతకు ముందే సూచించిన మెడిసిన్‌ను నిత్యం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ మెడిసిన్‌ను తీసుకోవడం ఆపకూడదు.