అవును నిజమే. సమాజంలో రోజు రోజుకీ మానవత్వం అన్నది మంట గలిసిపోతోంది. మనుషులే తోటి మనుషులకు సహాయం చేయడానికి వెనుదీస్తున్నారు. కొన్ని చోట్లనైతే కనీసం తోటి మనిషిని తాకడానికి కూడా కొందరు సందేహిస్తున్నారు. పురాతన ఆచారాలు, సంప్రదాయాలు, తమకు తాము విధించుకున్న కట్టుబాట్లు అనే కాకరకాయ కబుర్లు చెబుతూ తోటి వారికి సహాయం చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కానీ.. సమాజం ఏమీ గొడ్డుపోలేదు. ఇంకా మంచి వారు మిగిలే ఉన్నారు. అలాంటి వారిలో ఆ ఎమ్మెల్యే కూడా ఒకరు.
అది ఒడిశాలోని జార్సుగుడా జిల్లా ఆమనపలి గ్రామం. అక్కడ ఓ యాచకురాలు ఇటీవలే మృతి చెందింది. అయితే ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కారణం.. ఆమెను తాకితే తమ కులస్థులు తమను తమ కులం నుంచి, ఆ గ్రామం నుంచి బహిష్కరిస్తారని భయం. అందుకే ఎవరూ ఆ బిచ్చగత్తె మృతదేహాన్ని దహనం చేసేందుకు ముందుకు రాలేదు.
Odisha: Ramesh Patua,BJD MLA from Rengali, came forward to perform last rites of a woman in Jharsuguda's Amnapali Village y'day after locals skipped it fearing ostracisation. The woman,a beggar,lived with her ailing brother-in-law who couldn't attend the ceremony as he was unwell pic.twitter.com/ljoWPTXFSi
— ANI (@ANI) August 5, 2018
అయితే పక్కనే ఉండే సంబల్‌పూర్ జిల్లా రెంగలి నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ పటువా మాత్రం తన నియోజకవర్గం పరిధి కాకపోయినా ఆ యాచకురాలి మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాడు. తన బంధువులు కొందర్ని తోడు తీసుకుని వచ్చి ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉన్న శ్మశానంలో దహనం చేశారు. అయితే నిజానికి ఎమ్మెల్యే రమేష్ పెద్ద ధనికుడు ఏమీ కాదు. ఎమ్మెల్యే అయినా ఇప్పటికీ ఆయన నిరాడంబరంగానే ఉంటున్నాడు. అద్దె ఇంట్లోనే నివసిస్తున్నాడు. ఒడిశాకు చెందిన పలువురు పేద ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఒకరు. ఏది ఏమైనా ఎమ్మెల్యే రమేష్ పటువా చేసిన పనికి ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!