కేంద్ర ప్రభుత్వం దేశంలో మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించిన విషయం విదితమే. అయితే ఏప్రిల్ 20 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లోనూ కరోనా ప్రభావాన్ని బట్టి లాక్డౌన్ నిబంధనలను సడలించనున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాలను కూడా విడుదల చేసింది. ఇక ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ-కామర్స్ సంస్థలు తమ సేవలను యథావిధిగా ప్రారంభించుకోవచ్చని కూడా కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా దేశంలో కేవలం ఆహారం, ఇతర నిత్యావసరాలు, పాలు, మెడిసిన్ వంటి వస్తువులను మాత్రమే ఈ-కామర్స్ సంస్థలు డెలివరీ చేస్తున్నాయి. అయితే ఏప్రిల్ 20 నుంచి లాక్డౌన్ నిబంధనలను సడలించనుండడంతో.. ఈ-కామర్స్ సంస్థలు తమ కార్యకలాపాలను మునుపటి లాగా ప్రారంభించవచ్చని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ-కామర్స్ సంస్థలు ఏప్రిల్ 20 నుంచి మొబైల్ ఫోన్లతోపాటు టీవీలు, ఫ్రిజ్లు, ల్యాప్టాప్లు, ఇతర వస్తువులను కస్టమర్లకు డెలివరీ చేయవచ్చు.
అయితే ఈ-కామర్స్ సంస్థలు వస్తువులను డెలివరీ చేసే తమ వాహనాలు రోడ్లపై తిరిగేందుకు గాను ముందుగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంంటుందని కేంద్రం తెలిపింది. అలాగే సామాజిక దూరం పాటిస్తూ.. ఇతర జాగ్రత్త చర్యలను తీసుకుంటూ.. ఆయా సంస్థలు కస్టమర్లకు వస్తువులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.