తమిళ్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్న ఆయన ప్రతిభ కనబరిచిన పదో తరగతి, ప్లస్‌వన్, ప్లస్‌టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేస్తున్న విజయ్ 2026లో జరిగే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.
అందులో భాగంగా విజయ్ మక్కల్ ఇయక్కం(అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమయ్యారు. తాజాగా చెన్నై శివారు పనైయూర్‌లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ పేరుపై ఆయన ఎక్కువసేపు నిర్వాహకులతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
పార్టీకి మక్కల్(ప్రజలు), తమిళగం(తమిళనాడు), మున్నేట్రం(అభివృద్ధి), కళగం(పార్టీ) వంటి పదాలు విజయ్ సూచించినట్లు సమాచారం. ఈ మూడు పదాలు కలిసేలా ‘తమిళగ మున్నేట్ర కళగం’ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలిసింది. ఇదే పేరు తాజాగా ఎన్నికల సంఘంలో కూడా నమోదు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై విజయ్ కానీ ఆయన అభిమాన సంఘం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు.