ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులోకి వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి హోస్ట్ గా చేసిన ఈ సీజన్ సూపర్ హిట్ కావడంతో నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ అయినా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అలా ఇప్పటికే ఆరు రెగ్యులర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను కూడా పూర్తి చేసుకుంది ఈ షో.. ఇటీవల ఆరవ సీజన్ మినహా అన్ని సీజన్లకు మంచి రేటింగ్ లభించింది. దాంతో ఎలాగైనా సరే ఈసారి ఏడవ సీజన్ ప్రారంభించే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త కంటెంట్ ను తీసుకురావడానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడానికి నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ సీజన్లో కంటెస్టెంట్ లందరూ కూడా జంటలుగా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈసారి ఈ సీజన్లో ఇంటి సభ్యులందరినీ రియల్ లైఫ్ కపుల్స్ గా తీసుకోనున్నట్లు సమాచారం. అంటే మొత్తం 10 లేదా 11 జోడీలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ కానున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
ఇటీవల వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్, తేజస్విని గౌడ్ కూడా ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ జోడిలో ఒకరిగా రాబోతున్నారని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ సీజన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.