నిన్న పూరి జ‌గ‌న్నాథ్‌… ఇప్పుడు మంజుల!

త‌న అనుభ‌వంలో చూసిన విన్న విధ అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ అందులోని సారాంశాన్ని `పూరి మ్యూజింగ్స్‌` పేరుతో ఆడియ‌న్స్ పంచుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో సూప‌ర్‌స్టార్ కృష్ణ కుమార్తె, స్టార్ హీరో మ‌హేష్ సోద‌రి మంజుల ఘ‌ట్ట‌మ‌నేని చేరుతున్నారు. నీల‌కంఠ తెర‌కెక్కించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం `షో`తో జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకుంది. ప‌లు చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది.

`షో, పోకిరి, ఏమాయ చేసావె వంటి చిత్రాల‌తో నిర్మాత‌గా మంచి గుర్తింపుని ద‌క్కించుకుంది. `మ‌న‌సుకు న‌చ్చింది`తో ద‌ర్శ‌కురాలిగా ప్ర‌య‌త్నించినా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. న‌టిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కురాలిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న మంజుల తాజాగా పూరి త‌ర‌హాలో కొత్త బాట‌ని ఎంచుకుంది. త‌నకు టీచ‌ర్స్‌, మాస్ట‌ర్స్ నేర్పిన విష‌యాల‌తో పాటు త‌న అనుభ‌వాల‌ని ఆడియ‌న్స్‌తో షేర్ చేసుకోబోతోంది. ఇందు కోసం కొత్త‌గా `మంజుల ఘ‌ట్ట‌మ‌నేని` పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ తో పాటు ఓ వెబ్ సైట్‌ని ఈ ఆదివారం ప్రారంభించింది.

జీవితంలో ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాను. ఎత్తు ప‌ల్లాలు చూశాను. నా టీచ‌ర్స్ అండ్ మాస్ట‌ర్స్ నాకు ఎన్నో విష‌యాలు నేర్పించారు. నా ప్ర‌యాణంలో నేను నేర్చుకున్న ఎన్నో విష‌యాల్ని మీ అంద‌రితో పంచుకోవాల‌నుకుంటున్నాను. నా అనుభ‌వాల ద్వారా మీ జీవితాల్లో ఆనందాన్ని నింపాల‌నుకుంటున్నాను. ఇందు కోసం `మంజులఘ‌ట్ట‌మ‌నేని` యూట్యూబ్ ఛాన‌ల్‌తో పాటు ఓ వెబ్ సైట్‌ని ప్రారంభిస్తున్నాను. దీని ద్వారా నా అనుభ‌వాల్ని మీతో పంచుకోవాల‌నుకుంటున్నాను` అని తెలిపింది మంజుల‌.