రాజేంద్రప్రసాద్‌కు పృథ్వీ కౌంటర్… జగన్‌ను విమర్శిస్తే తాట తీస్తా

-

గత కొన్ని రోజులుగా సినీనటుడు, వైసీపీ నేత పృథ్వీ వార్తల్లో ఎక్కువ ఉంటున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయన్ని ఎస్వీబీసీ ఛైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. పదవి చెప్పట్టిన వెంటనే. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు జగన్ సీఎం అవ్వడం ఇష్టం లేదని… అందుకనే కనీసం ఆయన్ని కలిసి శుభాకాంక్షలు కూడా చెప్పలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే చంద్రబాబు సీఎం అయితే దండలు పట్టుకుని వెళ్లిపోతారని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఖండించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిని వెంటనే కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదని ఆయన అన్నారు. అయినా కళాకారులు సీఎంను కలవాలన్న నిబంధన ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కుదురుకున్న తరువాత ఆయనను కలుస్తామని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌ల కంటే ముందే పోసాని కూడా పృథ్వి మాట‌ల‌ను ఖండించారు.

ఇక రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై శుక్ర‌వారం పృథ్వీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. జగన్‌ సీఎం అయితే కలవాలా, సినిమా వాళ్ళు వ్యాపారస్తులా అని రాజేంద్రప్రసాద్ వ్యంగ్యంగా మాట్లాడడంలో ఎలాంటి అర్థం ఉందో చూడాలన్నారు. గతంలో చంద్రబాబును కలిసినప్పుడు ఇదంతా గుర్తులేదా ? అని ప్రశ్నించారు. సీఎంని కలిసే వాళ్లు కలుస్తున్నారని… కలవని వాళ్లని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. సినీ పరిశ్రమ అంతా కలిసి అత్యధిక మెజారిటీతో గెలిచిన సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపితే ప్రపంచమంతా గర్వపడి ఉండేదని అన్నారు.

రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమను రెండుగా చీల్చేలా ఉన్నాయని, వర్గ విభేదాలకు దారి తీసేలా వ్యవహరించారని పృథ్వీ విమర్శించారు. ఇక 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి రెండోసారి సీఎం అయితే టాలీవుడ్ పెద్దలు కలిసి శుభాకాంక్షలు చెప్పారని గుర్తు చేశారు. అదే సంప్రదాయం జగన్ విషయంలో ఎందుకు కొనసాగలేదని ప్రశ్నించారు. అయితే అకారణంగా జగన్ జోలికి వచ్చినా, విమర్శలు చేసినా తాను ఊరుకోబోనని, వారి తాట తీస్తానని పృథ్వీ వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news